ఇది పద్ధతి కాదు.. ట్రుడోపై అసహనం! జిన్‌పింగ్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌.. వీడియో వైరల్‌

Xi Confronts Justin Trudeau At G20 Counter From Canada PM - Sakshi

బాలి: ఇండోనేషియా వేదికగా జరిగిన జీ-20 సదస్సుల్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మధ్య కెమెరాల సాక్షిగా వాగ్వాదం జరిగింది. సమావేశాల్లో భాగంగా ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణల వివరాలన్నింటినీ మీడియాకు విడుదల చేసింది కెనడా ప్రధాని కార్యాలయం. అయితే.. ఈ వ్యవహారాన్ని జిన్‌పింగ్ తప్పుబట్టారు. ట్రుడో సమక్షంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

అన్నివివరాలూ మీడియాకు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. అలా ప్రతి చిన్న విషయాన్నీ మీడియాకు లీక్ చేయడం సరికాదన్నారు. చర్చలు జరిపే పద్ధతే ఇది కాదన్నారు. ఇలా చేయడం నిజాయితీతో కూడిన విధానం కాదని వాదించారు. ఇకపైన చర్చలు జరిపే ముందే నిబంధనలు పెట్టుకుందామని జిన్‌పింగ్ కుండబద్దలు కొట్టారు. అయితే.. దానికి కెనడా ప్రధాని ట్రోడో గట్టి బదులే ఇచ్చారు. చర్చల వివరాలన్నింటినీ మీడియాకు ఇవ్వడంలో తప్పేమీ కాదన్నారు. చర్చల్లో అన్ని అంశాలపై ఏకాభిప్రాయాలు కుదరవని, కొన్నింటికి సమ్మతి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇద్దరు నేతలూ మాట్లాడుకునేది కెనడా జర్నలిస్ట్ తన కెమెరాలో రికార్డ్ చేశారు.

ఇక ఇరు దేశాల మధ్య మంగళవారం జరిగిన భేటీలో.. కెనడా అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని ట్రుడో తప్పుబట్టారు. ఈ భేటీలో ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్టు సమాచారం. అంతేకాదు.. 2019 ఎన్నికల సమయం నుంచి అనేక విషయాల్లో చైనా జోక్యం చేసుకుంటోందని కెనడా ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనిపై ట్రుడో అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైనాను హెచ్చరించారు.  ఈ వివరాలు కెనడా మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యాయి. 

2018లో కెనడాలో అమెరికా అరెస్ట్ వారంట్‌పై చైనాకు చెందిన హువాయ్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్‌ను అరెస్ట్ చేసినప్పుడు చైనా మండిపడింది. ప్రతీకారంగా.. ఆ వెంటనే ఇద్దరు కెనెడా జాతీయులను గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి ఇప్పుడు జీ20 చర్చలకు ఒక రోజు ముందు కెనడా వాణిజ్య రహస్యాలను చైనాకు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఓ చైనా జాతీయుడిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై చైనా కూడా గుర్రుగా ఉంది.

ఇదీ చదవండి: పోలండ్‌పైకి క్షిపణుల దాడి.. అదిరిపోయే ట్విస్ట్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top