
లండన్: గత నెలలో జరిగిన భారత విమానయాన చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఒకటైన అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదంపై మరో వివాదం నెలకొంది.
‘అహ్మదాబాద్ ఎయిరిండియా (Air India Flight 171) ప్రమాదంలో ఇద్దరు యూకే ప్రయాణికులు మృతి చెందారు. మృతదేహాల్ని గుర్తించేందుకు కుటుంబ సభ్యుల నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వైద్యులు డీఎన్‌ఏ నమోనాల్ని సేకరించారు. వాటి ఆధారంగా ఘటనా స్థలంలో లభ్యమైన రెండు మృతదేహాలు వారి కుటుంబ సభ్యులవేనంటూ యూకే కుటుంబసభ్యులకు అప్పగించారు.
అసలు మృతదేహాలు ఎక్కడా?
కానీ డీఎన్‌ఏ పరీక్షల్లో యూకే కుటుంబ సభ్యుల డీఎన్‌ఏకు.. భారత్ వైద్యులు అప్పగించిన మృతదేహాలకు డీఎన్‌ఏ వేరుగా ఉందని తెలిపారు. మరి యూకే మృతుల బంధువులకు అప్పగించిన మృతదేహాలు ఎవరివి? అసలు మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదే విషయంపై యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులు భారత్‌తో న్యాయపోరాటం చేస్తున్నారు. మృతదేహాల మార్పుపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
డీఎన్‌ఏ మ్యాచ్ అవ్వలేదు
మృతదేహాల మార్పుపై బాధితుల తరుఫు న్యాయవాది జేమ్స్ హీలీ మీడియాతో మాట్లాడారు. ‘జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమానం ఏఐ 171 విమానంలో 12,13 సీట్లలో మా క్లయింట్ (యూకే ప్రయాణికులు) ప్రయాణించారు. మృతదేహాల గుర్తింపు కోసం మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ సేకరించారు. వాటి ఆధారంగా మృతదేహాల్ని గుర్తించారు. మాకు అప్పగించారు. మాకు అప్పగించిన మృతదేహాల్ని.. కుటుంబసభ్యుల డీఎన్‌ఏతో టెస్ట్ చేశాం. కానీ మాకు అప్పగించిన మృతదేహాల డీఎన్‌ఏకు, కుటుంబ సభ్యుల డీఎన్‌ఏకు మ్యాచ్ అవ్వడం లేదని వెల్లడించారు.

260 మంది ప్రయాణికులు దుర్మరణం
అహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్ బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 241 మంది మృతిచెందారు. ఇక, ఈ విమానం అహ్మదాబాద్ మేఘాణి నగర్‌లో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో అందులోని పలువురు మృతిచెందారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో 260 మంది మృతి చెందగా వారిలో 19మంది ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీలో ఉన్నవారివేనని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి సూపరిటెండెంట్ రాకేష్ జోషి తెలిపారు.
యూకే బాధిత ప్రయాణికులకు మద్దతుగా ఎయిరిండియా
డీఎన్‌ఏ రిపోర్టుల ఆధారంగా మృతదేహాల్ని గుర్తించడం, కుటుంబ సభ్యులకు అప్పగించే బాధ్యత ఎయిరిండియాది కానప్పటికీ.. యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులకు ఎయిరిండియా యాజమాన్యం అండగా నిలిచింది. బాధితుల మృతదేహాలను గుర్తించే విషయంలో తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చింది.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన యూకే ప్రయాణికుల మృతదేహాల్ని డీఎన్‌ఏ ఆధారంగా గుర్తించారు. ఆ మృతదేహాల్ని అంతర్జాతీయ అత్యవసర సేవ కెన్యన్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను ఉపయోగించింది. ఎయిర్ ఇండియా కార్గో ద్వారా మృతదేహాల అవశేషాలను మోసుకెళ్లే శవపేటికలను యూకేకి పంపారు.