
తీరుమార్చుకోని పాకిస్థాన్ మరోసారి బెదిరింపులకు దిగింది. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి.. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.
తాజాగా పాకిస్థాన్ ఓడలపై భారత్ నిషేధం విధించింది. పాకిస్థాన్ జెండా ఉన్న ఏ ఓడ కూడా భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలే తీసుకుంటోంది.
అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేసింది. పాక్ నుంచి వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్, పార్సిళ్లపై ఆంక్షలు విధించింది. కాగా, భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వీసాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.