గజరాజు దొంగ షాపింగ్‌  | Hungry Wild Elephant Stomps Into Grocery Store To Cause Chaos And Grabs Snacks In Thailand, See Details Inside | Sakshi
Sakshi News home page

గజరాజు దొంగ షాపింగ్‌ 

Jun 5 2025 6:18 AM | Updated on Jun 5 2025 9:29 AM

Wild Elephant Stomps into Grocery Store to Cause Chaos and Grabs Snacks

సూపర్‌మార్కెట్‌లోకి దూరి స్నాక్స్‌ను లాగించిన అడవి ఏనుగు 

థాయిలాండ్‌లో ఘటన 

ఏనుగు ‘షాపింగ్‌ బిల్లు’చెల్లించిన వన్యప్రాణి సంరక్షణా సంఘం 

బ్యాంకాక్‌: థాయిలాండ్‌లో ఒక అడవి ఏనుగు అమాంతం సూపర్‌మార్కెట్‌లోకి దూసుకొచ్చి ఎలాంటి బీభత్సం సృష్టించకుండా తనకేం కావాలో అవి మాత్రమే తినేసి నెమ్మదిగా వెళ్లిపోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నఖోన్‌ రాట్చసీమా ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దుకాణం ఉన్న ప్రాంతం ఖవో ఏఈ జాతీయవనానికి దగ్గర్లో ఉంది. 

ఈ నేషనల్‌పార్క్‌లో అడవి ఏనుగులు ఎక్కువ. వాటిల్లో కొన్ని అడవి నుంచి బయటికొచ్చి తిరుగుతుంటాయి. అలా తిరిగే ఏనుగుల్లో 27 ఏళ్ల మగ ఏనుగు ప్లాయీ బియాంగ్‌ లేక్‌ కూడా ఒకటి. ఈ ఏనుగు తరచూ అదే ప్రాంతంలో సంచరిస్తున్నా ఎవరికీ ఎప్పుడూ ఎలాంటి హానీ తలపెట్టలేదు. అయితే జూన్‌ రెండో తేదీన ఈ ఏనుగు హఠాత్తుగా ఖంప్లోయీ కకావూ అనే మహిళకు చెందిన ఒక సూపర్‌మార్కెట్లోకి దూరింది. అప్పుడు అక్కడే కౌంటర్‌ వద్ద ఉన్న మహిళా యజమాని ఒక్కసారిగా భయపడిపోయి అరిచి దుకాణంలోపలికి పరుగెత్తింది. 

సాధారణంగా అడవి మదపుటేనుగులు పట్టరాని ఆవేశంతో సమీప ప్రాంతాలను నాశనంచేస్తాయి. కానీ బియాంగ్‌లేక్‌ ఏనుగు మాత్రం ఎంతో ప్రశాంతంగా కనిపించింది. కేవలం అక్కడ ఉన్న మిఠాయిలను మాత్రమే తినాలని నిర్ణయించుకుంది. ఎదురుగా ఎన్నో రకాల తినుబండారాలు కనిపిస్తున్నా డీప్‌ రిఫ్రిజిరేటర్‌ను పక్కకు తోసేసిమరీ స్వీట్లు పెట్టిన చోటుకొచి్చంది. నెమ్మదిగా ఒక్కో స్వీట్‌ ప్యాకెట్‌ను గుటకాయస్వాహా చేసింది. ఇలా దాదాపు పది ప్యాకెట్లను తినేసింది. 

ఎలాగూ దాడి చేశాంకదా అదేదో పూర్తిగా సరిపోతుందని అనుకుందేమో. తర్వాత అరటి పండ్లను అమాంతం మింగేసింది. తర్వాత వేరునెనగపట్టీలను కకకరా నమిలేసింది. తర్వాత నెమ్మదిగా వెళ్లిపోయింది. ‘‘భయంతో లోపలికి పరుగెత్తా. తర్వాత ధైర్యం చేసుకుని పో పో అని ఎంత అరిచినా అది నా మాటను పట్టించుకోలేదు. 

ఈ ఏనుగును బయట చాలా సార్లు చూశా. మా దుకాణం ముందు నుంచి చాలా సార్లు వెళ్లిందిగానీ ఎప్పుడూ ఇలా ‘షాపింగ్‌’చేయలేదు’’అని దుకాణం యజమాని బియాంగ్‌ లేక్‌ చెప్పారు. ఏనుగు దుకాణంలో దూరిన వార్త తెల్సి అటవీశాఖ సిబ్బంది వచ్చి దానిని అక్కడి నుంచి తరిమేశారు. అయితే షాపులో ఏనుగు లూటీ వార్త తెలిసి ఒక వన్యప్రాణి సంరక్షణ సంఘం ప్రతినిధులు మా దుకాణానికి వచ్చారు. ఏనుగు షాపింగ్‌ చేసి బిల్లు చెల్లించకుండా వెళ్లిందని తెలిసింది. ఇదిగోండి ఆ బిల్లు అమౌంట్‌ అని నష్టపరిహారం 800 థాయ్‌ బాత్‌లను వాళ్లు చెల్లించివెళ్లారు’’అని దుకాణయజమానురాల నవ్వుతూ చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement