సాధారణంగా రాజకుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితం, అధికారిక కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తుంటారు. కానీ థాయ్‌లాండ్ రాణి సుతిదా(48) మాత్రం తన సాహసంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఏకంగా యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపి తన ఏవియేషన్ కెరీర్‌లో కీలక మైలురాయిని చేరుకున్నారు. తద్వారా ప్రపంచంలోనే తొలి పైలట్ క్వీన్ ఘనత సాధించారు. భర్త, థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ నోరెళ్లబెట్టి చూస్తుండగా ఆమె ఈ ఘనత సాధించడం విశేషం.
థాయ్‌లాండ్ దక్షిణ ప్రాంతంలోని సూరత్ థాని ప్రావిన్స్‌లో ఉన్న వింగ్ 7 వైమానిక స్థావరంలో గురువారం (అక్టోబర్ 8) రాణి సుతిదా ఈ సాహసయాత్ర చేపట్టారు. స్వీడన్‌లో తయారైన జేఏఎస్ 39సీ గ్రిపెన్ సింగిల్ సీటర్ యుద్ధ విమానంలో తొలిసారి ఒంటరిగా ప్రయాణించారు. విమానయాన ప్రణాళికపై వివరాలు తెలుసుకుని, టేకాఫ్‌కు ముందు విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం ఆమె గగనతలంలోకి దూసుకెళ్లారు.
ఈ ఘట్టాన్ని రాజు మహా వజిరలాంగ్‌కార్న్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఆ సమయంలో ఆయన ఆశ్చర్యపోతూ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. విమానం నుంచి దిగిన తర్వాత రాణికి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన గుర్తింపుగా ఇచ్చే ‘గ్రిపెన్ ఆర్డర్ గోల్డెన్ ప్యాచ్’ను కూడా అందజేశారు.
విమానయానంలో అపార అనుభవం
రాణి సుతిదాకు విమానాలు నడపడంలో మంచి అనుభవమే ఉంది. ఇప్పటివరకు వివిధ రకాల విమానాల్లో కలిపి 1,188.48 గంటల పాటు ప్రయాణించినట్లు బ్యాంకాక్ పోస్ట్ వెల్లడించింది. సెస్నా, పిలాటస్, పైపర్ వంటి విమానాలతోపాటు బోయింగ్ 737 ప్రయాణికుల విమానాలను కూడా ఆమె నడిపారు. 2010 మే 13న బ్యాంకాక్‌లోని వింగ్ 6 స్థావరంలో సెస్నా టీ-41డీ విమానాన్ని నడపడంతో ఆమె పైలట్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత రెండు సీట్ల గ్రిపెన్ జేఏఎస్ 39డీ యుద్ధ విమానంలోనూ ప్రయాణించారు. తాజాగా సింగిల్ సీటర్ గ్రిపెన్‌ను ఒంటరిగా నడిపి మరో మైలురాయిని చేరుకున్నారు.
రాజుతో కలిసి విమాన ప్రయాణాలు
రాణి సుతిదా రాజుతో కలిసి దేశీయ, అంతర్జాతీయ పర్యటనల సందర్భంగా విమానాల్లో కో-పైలట్‌గా కూడా వ్యవహరించారు. గతేడాది ఏప్రిల్‌లో భూటాన్ పర్యటన సందర్భంగా రాజదంపతులు కలిసి రాజకుటుంబ విమానాన్ని నడిపారు. పర్వత ప్రాంతాల మధ్య అత్యంత క్లిష్టమైన విమానాశ్రయంగా పేరున్న పారో విమానాశ్రయంలో విమానాన్ని దించారు.
🇹🇭 ‘The World’s only Pilot Queen’ – #Thailand’s Queen Suthida of Thailand passed her solo flight training with JAS 39C #Gripen. King Vajiralongkorn observed the training and congratulated her with a bouquet of flowers at Wing 7 Royal Air Force Base #SuratThani. พระปรีชาสามารถของ “พระราชินีนักบิน” หนึ่งเดียวในโลก #พระราชินี ทรงฝึกทำการบินโซโล่เดี่ยวกับเครื่องบินขับไล่ JAS 39C Gripen เป็นครั้งแรก และผ่านการทดสอบไปได้ด้วยดี ซึ่ง #ในหลวง ได้ทอดพระเนตรและพระราชทานช่อดอกไม้แสดงความยินดีในครั้งนี้ ณ กองบิน 7 #สุราษฎร์ธานี #KingVajiralongkorn #QueenSuthida #ThaiRoyalFamily #ข่าวในพระราชสำนัก #ทรงพระเจริญ
— Royal World Thailand 🇹🇭 (@rwthofficial) October 8, 2026
తాజా సోలో ఫ్లైట్‌తో సైనిక, పౌర విమానయాన రంగాల్లో తన అనుభవాన్ని రాణి మరోసారి చాటుకున్నారు. రాజకుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే విమానయానంపై ఆసక్తిని కొనసాగిస్తున్న ఆమె.. ఇప్పుడు యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన ఘనతతో వార్తల్లో నిలిచారు.
74 ఏళ్ల థాయ్‌లాండ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ (రామా X)కు ఇప్పటివరకు నలుగురు భార్యలు ఉన్నారు. ఆయన మొదట 1977లో సోమ్సావలిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత యువధిదా పోల్ప్రసెర్త్‌ను పెళ్లి చేసుకున్నారు. మూడో భార్య శ్రీరస్మి సువాదీతో 2001లో వివాహం జరగ్గా, 2014లో విడిపోయారు. నాలుగో భార్యగా 2019లో సుతిదాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె థాయ్‌లాండ్ రాణిగా కొనసాగుతున్నారు.
బాడీగార్డ్ నుంచి క్వీన్‌గా
1978 జూన్ 3న దక్షిణ థాయ్‌లాండ్‌లోని హాట్ యాయ్‌లో జన్మించిన సుతిదా అసలు పేరు సుతిదా తిడ్జాయ్. బ్యాంకాక్‌లోని అసంప్షన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2000–2003 మధ్య జపాన్ ఎయిర్‌లైన్స్‌లో, ఆ తర్వాత 2008 వరకు థాయ్ ఎయిర్‌వేస్‌లో విమాన సహాయకురాలిగా పనిచేశారు. అనంతరం రాజు భద్రతా విభాగంలో చేరి సైనిక, రాజభవన భద్రతా బాధ్యతల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. 2019 మే 1న రాజు వజిరలాంగ్‌కార్న్‌ను వివాహం చేసుకోగా, అదే ఏడాది మే 4న ఆయన పట్టాభిషేకం సందర్భంగా రాణి హోదా పొందారు.
ఇదీ చదవండి: అదే నిజమైతే .. పాక్ నాలుగు ముక్కలవ్వడం ఖాయం


