దేవి నవరాత్రులు ప్రారంభం కాగానే..సహజంగానే సాత్విక ఆహారమే తీసుకుంటారు. ముఖ్యంగా తొమ్మిది రోజుల పాటు నియమ నిష్టలతో దుర్గాపూజ చేసేవారు..పూర్తిగా ఉల్లి, వెల్లుల్లి లేని శాకాహారమే తీసుకుంటారు. అచ్చం మనలానే ఇదే సమయంలో అక్కడ తొమ్మిది రోజుల కఠిన శాకాహార వేడుక జరుగుతుందట. అది కూడా ఎందుకోసమో తెలిస్తే విస్తుపోతారు. అందులోనూ పాశ్చాత్య దేశాల్లో చాలావరకు నాన్‌వెజ్ లేకుండా పండుగలు ఉండవు. అలాంటిది అక్కడ ఒక దేశంలో ఇలాంటి ఆచారం పాటిస్తారు. అది ఎందుకోసమో..ఆ పండుగ విశిష్టత తదితరాలు గురించి సవివరంగా చూద్దామా..!.
ఈ వేడుకను థాయిలాండ్‌లోని ఫూకెట్ ద్వీపంలో ఉండే థాయి చైనీస్ సమాజం జరుపుకుంటుంది. నవ చక్రవర్తులను పూజించే ఉద్దేశ్యంతో ఈ వేడుకను జరుపుకుంటారు. అందుకోసం పాలు, గుడ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మద్యం వంటి వాటిని ముట్టరు. అందువల్లే దీన్ని కఠినమైన శాకాహార వేడుకగా పిలుస్తారు. నిజానికి ఈ వేడుకల్లో పాల్గొని వారు కూడా మాంసాహారం తీసుకోవడం అనేది సాధ్యం కాదట.
ఎందుకంటే రెస్టారెంట్లు, వీధి దుకాణాలు వంటి చోట్ల కూడా నాన్ వెజ్‌కి సంబంధించిన వంటకాలను విక్రయించవట. అందుకు గుర్తుగా పసుపు రంగు జెండాను ఎగరువేసి స్వచ్ఛందంగానే నాన్‌వెజ్‌ని విక్రయించవట. వాళ్లంతా కఠినమైన వీగన్‌ని అనుసరిస్తాయట. అంటే ఆయా రోజుల్లో కేవలం మొక్కల ఆధారిత ఆహారమే దొరుకుతుందట. అక్కడ దీన్ని ‘జే’ డైట్‌గా పిలుస్తారు. గో టెంగ్ స్తంభాన్ని నిలబెట్టే వేడుకతో ఈ పండుగ అధికారికంగా ప్రారంభమవుతుంది.
తొమ్మిది మంది చక్రవర్తి దేవతలను భూమికి ఆహ్వానించే ప్రయత్నంలో, జుయ్ టుయ్ పుణ్యక్షేత్రం వంటి ప్రధాన చైనీస్ పుణ్యక్షేత్రాలలో ఒక పవిత్ర స్తంభాన్ని నిలబెడతారు. ఈ ఏడాది ఈ వేడుక అక్టోబర్ 9న జరిగిందట. అంతేగాదు ఈ వేడుకలో తీవ్రమైన భక్తిప్రదర్శనలు కూడా ఉంటాయట. అంటే..కత్తులు, కఠారులు, శూలాలతో ముఖాన్ని, శరీరాన్ని స్వయంగా పొడుచుకునే ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఇలా చేస్తే దురదృష్టం దరిచేరదని వాళ్ల నమ్మకం.
ఆ తర్వాత ఇవ్ కెంగ్‌గా పిలిచే వీధి ఊరేగింపులు ఉంటాయి. అలాగే మనచోట కనిపించే నిప్పులగుండం వంటి ఆచారాన్ని కూడా పాటిస్తారు. అయితే వీళ్లు వేడి బొగ్గులపై చెప్పులు లేకుండా నడవడం తోపాటు పదునైన కత్తుల నిచ్చెలపై ఎక్కడం వంటివి చేస్తారు.
ఎక్కడ జరుగుతాయంటే..
ఫూకెట్ టౌన్‌లోని జూయి టుయి మందిరం ఈ వేడుకలకు ప్రధాన కేంద్రం. అలాగే సమీపంలో ఉండే బాంగ్ నియో మందిరం లేదా బాంగ్ లియావో ఊరేగింపు వేడుకలకు ప్రసిద్ధి. లోర్ రోంగ్, సామ్ కాంగ్ ఆలయాల వద్ద పదునైన నిచ్చెన ఎక్కడం, అగ్నిపై నడవడం వంటి ఆచారాలు ఉంటాయి. ఈ ఏడాది ఈ వేడుకలు ఆక్టోబర్10 నుంచి ప్రారంభమై ఆక్టోబర్ 18తో ముగుస్తాయి.
ఇదీ చదవండి: అమెరికా రాయబారి మెచ్చిన దుర్గా పూజ..! ఆ కారణంగానే స్పెషల్..


