
తద్వారా వ్యాధులను తగ్గించండి
ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు
నానాటికి మారుతున్న జీవన శైలి ప్రజలను రోగాల బారిన పడేస్తోంది. డయాబెటిస్, కేన్సర్‌వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటికి చెక్ పెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కొత్తరకం ప్రతిపాదన చేసింది. ‘‘చక్కెర పానీయాలు, మద్యం, పొగాకు ధరలు రాబోయే పదేళ్లలో కనీసం 50 శాతం పెరగాలి. వాటిపై ఆ మేరకు పన్నులు పెంచండి’’ అని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. స్పెయిన్‌లోని సెవిల్లెలో జరిగిన ఫైనాన్స్ ఫర్æ డెవలప్‌మెంట్ సమావేశం ఈ మేరకు సిఫార్సు చేసింది.
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. వాటిపై పన్నులను మరింతగా పెంచితే మధుమేహం, కేన్సర్ తదితర వ్యాధులకు కారణమయ్యే హానికరమైన ఉత్పత్తుల వాడకాన్ని బాగా తగ్గించవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ భావిస్తోంది. ‘‘దేశాల దగ్గరున్న అత్యంత సమర్థమైన నియంత్రణ సాధనాల్లో పన్నులు ముఖ్యమైనవి. ప్రజారోగ్యమే లక్ష్యంగా చక్కెర పానీయాలు, మద్యం, పొగాకు వంటివాటి వాడకాన్ని పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది’’ అని డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ ప్రమోషన్, వ్యాధి నివారణ విభాగం అసిస్టెంట్ డెరెక్టర్ జనరల్ జెరెమీ ఫర్రార్ అన్నారు.
ఆ దేశాల్లో సత్ఫలితం
కొలంబియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ దిశగా చేసిన ప్రయోగం మంచి ఫలితాలిచ్చింది. అదనపు పన్నులతో పొగాకు తదితరాల ధరలు విపరీతంగా పెరగడంతో వాటి వాడకం బాగా తగ్గింది. అయితే డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సులను పొగాకు తదితర పరిశ్రమలు వ్యతిరేకిస్తున్నాయి. ‘‘చక్కెర, తీపి పానీయాలపై పన్నుల వల్ల ఏ దేశంలోనూ ఆరోగ్య ఫలితాలు మెరుగుపడలేదు. ఊబకాయం వంటివి తగ్గలేదు. ఇలాంటి స్పష్టమైన ఆధారాలను డబ్ల్యూహెచ్‌ఓ విస్మరించడం ఆందోళనకరం’’ అని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆ‹ఫ్ బెవరేజెస్ అసోసియేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేట్ లోట్‌మాన్ విమర్శించారు.
మరోవైపు, ఇది ప్రజారోగ్యం సాకుతో పన్నుల భారం పెంచే యత్నమని కూడా విమర్శలొస్తున్నాయి. పన్నులు పెంచడం ఆల్కహాల్ సంబంధిత హానిని నివారిస్తుందనడం పక్కదారి పట్టించడమేనని డిస్టిల్డ్ స్పిరిట్స్ కౌన్సిల్‌లో సైన్స్ అండ్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమండా బెర్గర్ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ బ్లూంబర్గ్, ప్రపంచ బ్యాంకు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ మాత్రం పన్ను పెంపు ప్రతిపాదనను సమరి్థంచాయి. ఇందుకు ముందుకొచ్చే దేశాలకు తోడ్పడతామని చెప్పుకొచ్చాయి. 2012–22 మధ్య దాదాపు 140 దేశాలు పొగాకు ఉత్పత్తులపై పన్నులను 50 శాతం పైగా పెంచాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలపైనా పన్ను పెంచే యోచనలో ఉన్నాయి.
భారత్‌లో ఇలా...
భారత్‌లో కూడా కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలపై ఆరోగ్య పన్ను విధించాలని వైద్య నిపుణుల నేతృత్వంలోని జాతీయ కన్సారి్టయం సూచించింది. అంతేగాక పిల్లల ఆహార పదార్థాల మార్కెటింగ్‌పై కఠినమైన నియమాలు విధించాలని కోరింది. భారత్‌లో కౌమార దశలో ఉన్నవారిలో ఊబకాయం బాగా పెరుగుతుండటంపై ఇండియన్ కౌన్సిల్ ఆ‹ఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆ‹ఫ్ న్యూట్రిషన్ ఆందోళన వ్యక్తం చేశాయి. యువత ఆహారపు అలవాట్లను మార్చడానికి, మెరుగుపరచడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. క్యాంటీన్లలో, విద్యా సంస్థల సమీపంలో కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాల విక్రయాన్ని నిషేధించాలని డిమాండ్ చేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్