తన పెళ్లికి రానందుకు అతిథికి 17 వేల బిల్లు పంపిన వధువు

Viral: Bride Sends Bill To Wedding Guest who Not Came For Reception Dinner - Sakshi

ఇంట్లో శుభకార్యాలకు అతిథులను పిలవడం ఆనవాయితీ. ఇక మనకు కావాల్సిన వాళ్లని తప్పకుండా రావాలని మరీ మరీ పిలుస్తుంటాం కూడా.  వారి వారి మధ్య ఉన్న బంధం బట్టి అతిథులు పిలిచిన కార్యాలకు హాజరుకావడం సహజం. ఈ క్రమంలో కొందరు వీలు లేకనో లేదా అంత కంటే ముఖ్యమైన పని ఉన్న కారణంగానో కార్యానికి వెళ్లలేకపోవచ్చు. ఇది మామూలుగా జరిగే తతంగమే. కానీ ఓ పెళ్లి కూతురు తన పెళ్లికి రానందుకు ఓ అతిథికి 17 వేల రూపాయ‌ల ఫైన్ వేసి ‍కట్టాలని పంపడంతో అతడు షాక్‌ అయ్యాడు. 


అసలేం జరిగిందంటే... అమెరికాలోని చికాగోలో ఓ యువతి తన పెళ్లికి రావాల్సిందిగా ఒక వ్యక్తిని పిలిచింది. అందుకు అతను తప్పక హాజరవుతానని చెప్పాడు. అందులోనూ జంటగా వ‌స్తామ‌ని మాటివ్వ‌డంతో.. ఇద్ద‌రి కోసం ఆ పెళ్లి కూతురు రెండు సీట్ల‌ను రిజ‌ర్వ్ చేసింది. ఇందుకుగాను ఒక్కో సీటుకు 120 డాల‌ర్ల చొప్పున‌.. 240 డాల‌ర్ల‌ను ఖర్చు పెట్టింది. అయితే చివ‌ర‌కు వస్తానని చెప్పిన అతిథి ఆ పెళ్లి రిసెప్ష‌న్‌కు వెళ్లలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ పెళ్లి కూతురు.. ఆ వ్య‌క్తి రెండు సీట్లు రిజర్వ్‌ చేయడం కోసం అయిన ఖ‌ర్చు 240 డాల‌ర్లు.. అంటే మ‌న క‌రెన్సీలో 17,700 రూపాయ‌ల బిల్లును రానందుకు పెనాల్టీగా ఓ ఇన్‌వాయిస్‌ బిల్లును అతడికి పంపించింది.     (చదవండి: అలిగి మండపం ఎక్కనన్న వధువు.. కారణం తెలిసి నవ్వుకున్న నెటిజన్స్‌)

ఆ బిల్లులో.. నువ్వు చెప్పినట్లు రిసెప్ష‌న్‌కు రాకపోగా, ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. కనుక నీ కోసం రిజ‌ర్వ్ చేసిన సీట్లకు అయిన ఖర్చు నువ్వే చెల్లించాలి. జెల్లే లేదా పేపాల్‌.. ఇలా ఏ పేమెంట్  ద్వారా అయినా చెల్లించు.. అంటూ ఇన్‌వాయిస్‌తో పాటు.. ఒక నోట్‌ను కూడా పంపించింది ఆ న‌వ వ‌ధువు. ప్రసుతం ఆ బిల్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కొందరు మండిపడగా, మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top