అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్‌లో సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ శకం పరిసమాప్తి కావాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. పొలిటికో వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్ అంశంపై మాట్లాడారు. ‘‘ఇరాన్‌లో నూతన నాయకత్వం తెరమీదకు రావల్సిన తరుణం ఆసన్నమైంది. ఖమేనీని సాగనంపాల్సిందే’’అని అన్నారు. తమ దేశంలో హింసకు ట్రంపే కారణమని ఖమేనీ పలుమార్లు ఆరోపణలు గుప్పించిన వేళ ఇరాన్‌లో నాయకత్వ మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలుచేయడం ఇదే తొలిసారికావడం విశేషం.
‘‘దేశంలో అత్యున్నత పరిపాలనా హోదాలో కొనసాగుతూ కూడా దేశం సర్వనాశనమవుతుంటే ఆయన(ఖమేనీ) పట్టించుకోలేదు. పైగా పోలీసు చర్యతో ఉద్యమాలను అణచివేస్తూ హింసను ప్రోత్సహించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో హింసాత్మక ఘటనలకు కారకుడయ్యారు. నాయకులు నాలా దేశాన్ని సవ్యంగా పరిపాలించడంపై దృష్టి సారించాలి. అధికారంలో కొనసాగేందుకు ఆయనలాగా నేను వేలాది మందిని చంపలేదు. అసమర్థ ఖమేనీకి పరిపాలించే అర్హత లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


