
న్యూఢిల్లీ: -అగ్రరాజ్యం అమెరికా సాక్షిగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ చర్చలకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఎస్‌ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేసి మాట్లాడారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలపై మోదీతో మాట్లాడారు జేడీ వాన్స్. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జేడీ వాన్స్. అయితే పాక్ దాడి చేస్తే తాము దాడికి దిగుతామంటూ జేడీ వాన్స్‌కు మోదీ స్పష్టం చేశారు. తమ సంయమనం బలహీనత కాదని, దేశ భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని జేడీ వాన్స్‌కు తేల్చిచెప్పారు నరేంద్ర మోదీ.
రేపు(సోమవారం) పాకిస్తాన్ తో కాల్పుల విరమణ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో జేడీ వాన్స్ ఫోన్ చేసి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ నేతృత్వంలో భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అంశంపై చర్చలు జరుగునున్న తరుణంలో జేడీ వాన్స్ ముందగా పోన్ చేసి మోదీతో మాట్లాడారు. అయితే అంతకమునుపే కశ్మీర్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పీవోకే విషయంలో భారత్ రాజీపడే ప్రసక్తే ఉండదన్నారు. దీనికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని అమెరికాకు పరోక్షంగా చెప్పేశారు మోదీ. పీవోకే తమదేనని, ఇందులో ఎవరు జోక్యం అవసరం లేదన్నారు. పీవోకేను తమకు అప్పగించడం ఒక్కటే పాకిస్తాన్ కు ఉన్న ఆప్షన్ అని మోదీ తెగేసి చెప్పేశారు.
కాగా, భారత్, పాకిస్తాన్‌ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి. పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.
అయితే దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలు పంపింది భారత ప్రభుత్వం.