న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి, భారతీయ మూలాలున్న ఉషా వాన్స్ నాలుగోసారి తల్లికాబోతున్నారు. ఈ విషయాన్ని దంపతులు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో పండంటి అబ్బాయికి ఆమె జన్మనివ్వబోతున్నారని ఆ ప్రకటన పేర్కొంది. ‘‘ఉషా నాలుగోసారి తల్లికానుండటం మాకెంతో సంతోషంగా ఉంది. పుట్టబోయే బాబు, తల్లి ఆరోగ్యం బాగుంది. మా బాగోగులు చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతున్న మిలటరీ వైద్య బృందానికి మా కృతజ్ఞతలు. వాళ్ల భరోసాతోనే మేం కుటుంబాన్ని చూసుకుంటూనే దేశ బాధ్యతలూ అద్భుతంగా నెరవేరుస్తున్నాం’’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఉషా విషయం తెల్సి అమెరికా అధ్యక్షభవనం సైతం ‘ఎక్స్’లో శుభాకాంక్షలు తెలిపింది.



