ఇరాన్‌పై బిగ్‌ ట్విస్ట్‌.. ట్రంప్‌, వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు | US Trump And Vance question Iran leadership | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై బిగ్‌ ట్విస్ట్‌.. ట్రంప్‌, వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు

Oct 7 2026 10:39 AM | Updated on Oct 7 2026 10:43 AM

US Trump And Vance question Iran leadership

ఏడు నెలలుగా కొనసాగుతున్న ఇరాన్‌-అమెరికా యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరుగుతున్న వేళ.. టెహ్రాన్‌ నాయకత్వంపై అమెరికా చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇరాన్‌లో అసలు నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో స్పష్టంగా తెలియడం లేదని అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు మరుసటి రోజే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా స్పందిస్తూ.. ‘ఇరాన్‌ను ఎవరు నడుపుతున్నారో ఎవరికీ తెలియదు’ అని అన్నారు. దీంతో యుద్ధం కంటే ఇప్పుడు ఇరాన్‌ అధికార వ్యవస్థపై అమెరికా వ్యక్తం చేస్తున్న సందేహాలే అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

రాయిటర్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జేడీ వాన్స్‌ మాట్లాడుతూ.. ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీతో అమెరికా చర్చలు జరుపుతోందని తెలిపారు. అయితే, దేశంలో వాస్తవంగా నిర్ణయాలు తీసుకునే అధికారం వీరికి ఎంతవరకు ఉందో స్పష్టంగా తెలియడం లేదని అన్నారు. ఇరాన్‌ రాజకీయ వ్యవస్థలో నిర్ణయాలు ఎవరు?.. ఎలా తీసుకుంటారో పూర్తిగా అర్థం చేసుకోవడం అమెరికాకు సవాలుగా మారిందని వాన్స్‌ వ్యాఖ్యానించారు.

వాన్స్‌ వ్యాఖ్యలపై మరుసటి రోజే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇరాన్‌తో చర్చలు, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై అమెరికా ముందుకు వెళ్తున్నప్పటికీ.. ‘అతిపెద్ద సమస్య ఏమిటంటే.. ఇరాన్‌ను ఎవరు నడుపుతున్నారో ఎవరికీ తెలియదు’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇరాన్‌ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ దాదాపు ఒకే రకమైన సందేహాలను వ్యక్తం చేయడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరాన్‌ సీరియస్‌.. 
ఇదిలా ఉండగా.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ విషయంలోనూ గత కొంతకాలంగా అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. యుద్ధం సమయంలో ఆయన ప్రజల ముందుకు రాకపోవడం, ఆయన ప్రస్తుత పరిస్థితి, ఆచూకీపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్‌ మాత్రం ఈ వాదనలను ఖండిస్తోంది. మొజ్తబా ఖమేనీనే దేశ సుప్రీం లీడర్‌గా కొనసాగుతున్నారని, ఆయన దేశాన్ని నడిపిస్తున్నారని స్పష్టం చేస్తోంది. ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ కూడా అమెరికా వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అమెరికా అధికారులకు తమ ఇరానియన్‌ ప్రతినిధులు ఎవరన్నది, దేశ నిర్ణయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్నది తెలుసని చెప్పారు. అసలు సమస్య ఇరాన్‌లో నాయకత్వం లేదా నిర్ణయ వ్యవస్థలో లేదని.. అమెరికా అధికారుల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు, గందరగోళమైన సందేశాలేనని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్‌ తన అణు కార్యక్రమంపై కూడా కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వాన్స్‌ స్పష్టం చేశారు. అమెరికా డిమాండ్లను అంగీకరించాలంటే ఇరాన్‌ తన అణు ఇంధన శుద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అంటే శాంతి చర్చల్లో కేవలం యుద్ధ విరమణ మాత్రమే కాకుండా.. ఇరాన్‌ అణు కార్యక్రమం కూడా ప్రధాన అంశంగా మారింది. ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో వాన్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. తానే ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నానని చెప్పేందుకు ఆయన నిరాకరించారు. గతంలో వాన్స్‌ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ.. అది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు మరోసారి చర్చలు మొదలైన నేపథ్యంలో ఇరాన్‌ నాయకత్వంపై అమెరికా సందేహాలు, అణు శుద్ధి సామర్థ్యంపై అమెరికా డిమాండ్లు కీలకంగా మారాయి. 

ఇదీ చదవండి: రష్యాలో కొత్త వైరస్‌ కలకలం.. భారత్‌కు ముప్పు ఉందా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement