అప్పటివరకు ఇంతే..: మరో బాంబ్‌ పేల్చిన ట్రంప్‌ | US not to rush into a deal with Iran Trump | Sakshi
Sakshi News home page

అప్పటివరకు ఇంతే..: మరో బాంబ్‌ పేల్చిన ట్రంప్‌

May 24 2026 9:19 PM | Updated on May 24 2026 9:29 PM

US not to rush into a deal with Iran Trump

వాషింగ్టన్ డీసీ: పశ్చిమాసియా సంక్షోభానికి పూర్తి పరిష్కారం దిశగా ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే విషయంలో అమెరికా తొందరపడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చెప్పారు. ఇరు పక్షాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరి, ధ్రువీకరణ పూర్తై, సంతకాలు అయ్యే వరకు ఇరాన్‌ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన “దిగ్బంధం” పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అది “మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి” అని వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామాపై విమర్శలు చేస్తూ, ఇరాన్‌ అణ‍్వాయుధ సామర్థ్యం పెంచుకునే దారిని ఆ ఒప్పందం తెరిచిందని ఆరోపించారు.

‘‘మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి ఇరాన్ అణు ఒప్పందం. దీనిని బరాక్ హుస్సేన్ ఒబామా, ఆయన అడ‍్మినిస్ట్రేటివ్‌లోని అనుభవం లేని వారు ముందుకు తీసుకువచ్చి అమల్లోకి తెచ్చారు. అది ఇరాన్ అణ‍్వాయుధం తయారు చేసే దిశగా నేరుగా తీసుకెళ్లింది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ ఇరాన్‌తో జరుపుతున్న చర్చలు అలా కాదు. అసలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. టైమ్‌ మన వైపు ఉండడంతో ఒప్పందం త్వరగా ముగించాలనే తొందరపడొద్దని నా ప్రతినిధులకు చెప్పాను. ఒప్పందం పూర్తిగా ఖరారై, ధ్రువీకరణ పొంది, సంతకం అయ్యే వరకు దిగ్బంధం పూర్తిగా కొనసాగుతుంది. ఇరు పక్షాలు సమయం తీసుకుని సరిగ్గా చేయాలి. ఎలాంటి తప్పులు జరగకూడదు.

ఇరాన్‌ అణ‍్వాయుధం లేదా అణు బాంబు తయారు చేయకూడదు, పొందకూడదు అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు సహకారం అందించిన పశ్చిమాసియా దేశాలన్నింటికీ నా ధన్యవాదాలు. వారు చరిత్రాత్మక అబ్రహాం ఒప్పందాల్లో చేరడం వల్ల ఈ సహకారం ఇంకా బలపడుతుంది. ఎవరికి తెలుసు.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కూడా అందులో చేరాలని అనుకోవచ్చు’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement