వాషింగ్టన్: వ్యాపార లేదా పర్యాటక వీసాలపై అమెరికాకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త. అమెరికా ప్రభుత్వం ప్రీమియం సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. దీనిప్రకారం దరఖాస్తు ప్రాథమిక రుసుము 185 డాలర్లతోపాటు 750 డాలర్లు అదనంగా చెల్లిస్తే వీసా ప్రక్రియను చాలా వేగంగా పూర్తిచేస్తారు. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్‌లో త్వరలో నోటీసు ప్రచురించబోతున్నారు.
ఎంపిక చేసిన యూఎస్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో దరఖాస్తుదారులు 750 డాలర్లు చెల్లించి 10 రోజుల్లోగా ఇంటర్వ్యూ కోసం అపాయింట్‌మెంట్ పొందవచ్చు. మొదట దీన్ని పైలట్ కార్యక్రమంగా ఈ ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్ 31 దాకా అమలు చేయబోతున్నారు. అమెరికాలో అడుగుపెట్టడాన్ని కష్టతరం చేసేలా ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల విదేశీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కఠిన వీసా ప్రక్రియను సులభతరం చేయడానికే అదనపు ఫీజు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం.


