ఇటీవల యుఎస్ సుప్రీంకోర్టు ట్రంప్‌కు భారీ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విదేశీ వస్తువులపై ట్రంప్ వేసిన అధిక పన్నులు చెల్లవని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రీఫండ్ పాసెస్ మెుదలుపెట్టింది. దీంతో భారత్‌కు 10 నుంచి 12 బిలియన్ డాలర్లు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అధిక పన్నుల పేరుతో ప్రపంచ దేశాలని హడలెత్తించిన ట్రంప్‌నకు.. అక్కడి సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. దిగుమతులపై పన్నులు వేసే అధికారం అమెరికా అధ్యక్షుడికి గానీ వైట్‌హౌస్‌కు గానీ లేవని తేల్చిచెప్పింది. అంతేకాకుండా అంతవరకూ వేసిన సుంకాలు దిగుమతిదారులకు చెల్లించాల్సి కూడా రావచ్చని పేర్కొంది. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో అమెరికా ఆ అధిక పన్నులను తిరిగి చెల్లించడం ప్రారంభించింది..
అమెరికా కస్టమ్స్ విభాగం టారిఫ్‌ల ద్వారా వసూలైన మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించింది. మెుత్తంగా అమెరికా 166 బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సూమారుగా ₹13,86,100 కోట్లు తిరిగి చెల్లించడానికి అంగీకరించింది. అయితే ఈ మెుత్తంలో భారత్‌కు 10 నుంచి 12 బిలియన్ డాలర్ల వరకు భారత్‌కు సంబంధించిన దిగుమతులపై వసూలైనవిగా గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక వెల్లడించింది. దీంతో ఆ మెుత్తం భారత్‌కు తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. ప్రధానంగా టెక్స్ టైల్స్, ఇంజినీరింగ్ గూడ్స్, కెమికల్స్ రంగాల్లో ఈ రిఫండ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
అయితే ఈ మొత్తాన్ని నేరుగా భారత కంపెనీలు పొందలేవు. అమెరికాలో వస్తువులు దిగుమతి చేసిన కంపెనీలకే రిఫండ్ దరఖాస్తు చేసే హక్కు ఉంటుంది. దీంతో భారత ఎగుమతిదారులు తమ అమెరికా భాగస్వాములతో చర్చలు జరిపి రిఫండ్‌లో వాటా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వేలాది కంపెనీలు రిఫండ్ కోసం నమోదు చేసుకున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా 60 నుంచి 90 రోజుల్లో చెల్లింపులు పూర్తయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.


