లక్ష డాలర్ల హెచ్‌1బీ ఫీజు రద్దు!  | US Federal Court Vacates H-1B Visa 100000 Dollars Fee Policy | Sakshi
Sakshi News home page

లక్ష డాలర్ల హెచ్‌1బీ ఫీజు రద్దు! 

Jun 10 2026 4:34 AM | Updated on Jun 10 2026 6:35 AM

US Federal Court Vacates H-1B Visa 100000 Dollars Fee Policy

లక్ష డాలర్ల హెచ్‌1బీ ఫీజు రద్దు! 

స్వాగతించిన ఎన్నారై సంస్థలు  

ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న ప్రభుత్వం  

వాషింగ్టన్‌: అమెరికా కలల్ని పండించే హెచ్‌1–బీ వీసా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్‌ సర్కారు విధించిన లక్ష డాలర్ల ఫీజును ఫెడరల్‌ కోర్టు కొట్టి వేసింది. కాంగ్రెస్‌ ఆమోదం లేకుండానే ఇంత భారీ మొత్తం వీసా ఫీజు వసూలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని బోస్టన్‌ నగరంలోని ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి లియో సోరోకిన్‌ తీర్పు వెలువరించారు. 

ఈ మేరకు సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. ‘‘అమెరికా కాంగ్రెస్‌ అనుమతిలేకుండా ప్రభుత్వం ఇలా భారీ స్థాయిలో పన్నులను మోపేందుకు అధికారంలేదు. ఇమ్మిగ్రేషన్‌ విధానాలు, పన్నులపై నిర్ణయాలు తీసుకునే అధికారం అమెరికా కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. ఫీజు, పేమెంట్‌ అని చెబుతున్నప్పటికీ వీసా పిటిషన్‌దారులపై ట్రంప్‌  పన్ను భారం మోపారు’’ అని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ సంతతి సంఘాలు ఈ తీర్పును స్వాగతించాయి. ఉద్యోగ ఆధారిత వీసాల విషయంలో ఇది మెరుగైన నిర్ణయమని కొనియాడాయి. 

అమెరికన్‌ కంపెనీలు నిపుణులైన విదేశీయులను నియమించుకునేందుకు హెచ్‌1–బీ వీసా అవసరం. భారతీయ ఐటీ ఉద్యోగులతోపాటు వివిధ దేశాల నుంచి పరిశోధకులు, అత్యాధునిక టెక్నాలజీ రంగాల్లో పని చేసేవారు హెచ్‌1–బీ వీసా కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే, డొనాల్డ్‌ ట్రంప్‌ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వీసా జారీ ప్రక్రియలో పలు మార్పులు చేయడమే కాకుండా ఒక్కో హెచ్‌1–బీ వీసా దరఖాస్తుకు లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై 20 రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేస్తూ బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించగా జడ్జి దీనిపై విచారణ జరిపి భారీ ఫీజు సరికాదని తేల్చి చెప్పారు.  

ఇకపై మరిన్ని ఇబ్బందులు!  
‘‘హెచ్‌1–బీ వీసాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపశమనం ఇచ్చిన తీర్పిది. అయితే ఈ విషయం ఇక్కడితో సమసిపోతుందా? అన్నది ప్రశ్నార్థకం’’ అని ఇండియాస్పోరా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ జోషీపుర వ్యాఖ్యానించారు. నిబంధనల పేరుతో అమెరికన్‌ ప్రభుత్వం హెచ్‌1–బీ వీసాదారులను ఇకపై కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. 

అమెరికా టెక్నాలజీ, ఆరోగ్య, తయారీ రంగాల పురోభివృద్ధికి అంతర్జాతీయ నిపుణులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్‌ చీఫ్‌ ఆఫ్‌ పాలసీ అండ్‌ స్ట్రాటజీ ఖండేరావ్‌ కాండ్‌ చెప్పారు. ఆర్థికపరమైన వాస్తవిక పరిస్థితులతోపాటు చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే కీలకమైన విధానపర అంశాల్లో మార్పులు చేయాలన్న ప్రాథమిక విషయాన్ని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని వివరించారు. 

ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేస్తాం
లక్ష డాలర్ల హెచ్‌1–బీ వీసా ఫీజును రద్దు చేస్తూ మసాచుసెట్స్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అప్పీల్స్‌ కోర్టులో సవాలు చేయనున్నట్లు వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి ఒకరు సూచనప్రాయంగా తెలిపారు. హెచ్‌1–బీ వీసా పథకాన్ని దశాబ్దాలుగా దురి్వనియోగం చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికే అధ్యక్షుడు ట్రంప్‌ చర్యలు తీసుకున్నారని చెప్పారు. 

కొంతమంది రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులు కూడా లక్ష డాలర్ల వీసా ఫీజును న్యాయస్థానం కొట్టివేయడాన్ని స్వాగతిస్తుండడం గమనార్హం. భారీ వీసా ఫీజు కారణంగా వైద్య సిబ్బందితోపాటు ఉపాధ్యాయులను అమెరికాకు రప్పించడం చాలా కష్టమైపోయిందని, ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన టీచర్లు లేకుండా పోతున్నారని అలాస్కా రిపబ్లికన్‌ సెనేటర్‌ లీజా ముర్కోస్కీ చెప్పారు. 

అమెరికా ఆరోగ్య రంగంలో ఇప్పటికే సిబ్బంది కొరత ఉండగా.. లక్ష డాలర్ల వీసా ఫీజు అదనపు భారం మోపిందని, కోర్టు తీర్పుతో భారీ ఊరట లభించినట్లేనని నార్త్‌ వర్జీనియా డెమోక్రాట్‌ ప్రతినిధి డాన్‌ బేయర్‌ హర్షం వ్యక్తంచేశారు. రిపబ్లికన్‌ ప్రతినిధి మైక్‌ లాలర్, జార్జియా డెమోక్రాట్‌ ప్రతినిధి సాన్‌ఫర్డ్‌ డి.బిషప్, కాలిఫోర్నీయా, న్యూజెర్సీ అటార్నీ జనరళ్లు రాబ్‌ బోంటా, జెన్నిఫర్‌ డావెన్‌పోర్టు తదితరులు కోర్టు తీర్పును స్వాగతించారు.  

దేశానికి తీవ్ర హాని 
హెచ్‌–1బీ వీసా ఫీజు విషయంలో మసాచుసెట్స్‌ ఫెడరల్‌ కోర్టు ఉత్తర్వును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తప్పుపట్టారు. అలాంటి చర్యలు దేశానికి తీవ్ర హాని కలిగిస్తాయని మంగళవారం ఆక్షేపించారు. ‘‘ఈ న్యాయమూర్తులు నిజంగా మాకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇది చాలా విపరీతమైన పరిస్థితి. వారు మా దేశానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నారు’’అంటూ ట్రంప్‌ విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement