
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ ఓ అద్భుతమంటూ కితాబిచ్చారు. మస్క్ ఎల్లప్పుడూ తమతోనే ఉంటారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రేపు ఇద్దరం కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటామని ట్రంప్ వెల్లడించారు.
అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ ప్రకటనపై తాజాగా ట్రంప్ స్పందించారు. ట్రంప్ తన ట్రూత్ వేదికగా.. ఎలాన్క్ మస్క్ ఓ అద్భుతమైన వ్యక్తి. నేను, మస్క్ కలిసి రేపు ఓవల్ ఆఫీసులో మీడియా సమావేశంలో పాల్గొంటాం. మస్క్ ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు. అన్ని విధాలుగా సాయం అందిస్తూనే ఉంటారు అని చెప్పుకొచ్చారు.
మస్క్ గుడ్‌బై..
ఇదిలా ఉండగా, అంతకుముందు ఎలాన్ మస్క్.. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు.
ఇక, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్‌ను డోజ్ శాఖ సారథిగా నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పని చేసింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ విభాగం అనేకమంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో ప్రభుత్వంలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు తలెత్తినప్పటికీ ట్రంప్ వాటిని ఖండిస్తూ వచ్చారు.
ఇక, ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ బిల్లునకు వ్యతిరేకంగా మస్క్ తొలిసారి తన స్వరాన్ని వినిపించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండడం వల్ల.. ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి డోజ్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృథా అవుతాయని ఆయన నిరాశ వ్యక్తంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మస్క్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.
కేబినెట్‌తో ఉద్రిక్తతలు..
నిజానికి ట్రంప్ కేబినెట్‌కు మస్క్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. మార్చిలో లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులకు మస్క్ ఇమెయిల్ పంపడాన్ని ఎఫ్‌బీఐ, స్టేట్ డిపార్ట్‌మెంట్, పెంటగాన్ విభేదించాయి. మస్క్ తన అధికారాన్ని అతిక్రమిస్తున్నారని, ఇమెయిల్‌కు సమాధానం ఇవ్వవద్దని తమ ఉద్యోగులకు సూచించాయి. ఆ తరువాత విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, మస్క్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలతో ట్రంప్, మస్క్ మధ్య అంతరం పెరిగింది. ఈ సంక్షోభం ఉన్నప్పటికీ ఫెడరల్ ఖర్చులను 2 ట్రిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్లకు తగ్గించారు. ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాకే డోజ్ సారథ్యం నుంచి నిష్క్రమించబోతున్నానని మస్క్ చెప్పుకొచ్చినా.. ప్రభుత్వంలో ఎదురైనా చేదు అనుభవాలు మస్క్‌ను ఇబ్బంది పెట్టాయి.
కాగా.. అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికీ వరుసగా 130 రోజులకు మించి ఈ హోదాను ఇవ్వకూడదు. ఈ లెక్కల ప్రకారం మే 30తో మస్క్ గడువు పూర్తికానుంది. దీని ప్రకారమే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, మస్క్ వైదొలిగినప్పటికీ డోజ్ తన పనిని కొనసాగిస్తోందని ట్రంప్ గతంలోనే తెలిపారు. క్యాబినెట్ సెక్రటరీలు దీని బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించారు.