ట్రంప్, జెలెన్‌స్కీ ఏకాంత చర్చలు | Ukrainian President Zelensky and US President Trump meet inside St Peters Basilica | Sakshi
Sakshi News home page

ట్రంప్, జెలెన్‌స్కీ ఏకాంత చర్చలు

Apr 27 2025 4:53 AM | Updated on Apr 27 2025 5:16 AM

Ukrainian President Zelensky and US President Trump meet inside St Peters Basilica

వాటికన్‌ సిటీలో ఓ 15 నిమిషాలు

త్వరలోనే అత్యున్నత సమావేశమని వెల్లడి

పుతిన్‌తో ముఖాముఖిపై పరోక్ష సూచనలు 

కీవ్‌: పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వాటికన్‌ సిటీకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అక్కడే భేటీ అయ్యారు. అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందుగా వీరిద్దరూ సెయింట్‌ పీటర్స్‌ బసిలికాలో 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. ప్రైవేట్‌గా సమావేశమైన ఇద్దరు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్‌హౌస్‌ కూడా తెలిపింది. 

ఇతర వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా అత్యున్నత స్థాయి సమావేశం త్వరలోనే జరగనుందని అంతకుముందు రోమ్‌ చేరుకున్న ట్రంప్‌ తన సొంత ట్రూత్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘పుతిన్, జెలెన్‌స్కీ ఒప్పందానికి అతి సమీపంలో ఉన్నారు. యుద్ధం ముగింపునకు రావాలంటే వీరి సమావేశం జరగాలి. చాలా ముఖ్యమైన అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. 

ఇప్పుడే ఈ రక్తపాతాన్ని ఆపాలి. క్రూరమైన, అర్థరహితమైన ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాం’అని శుక్రవారం ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్‌ ప్రకటించారు. ట్రంప్‌ దూత స్టీవ్‌ విట్కాఫ్‌ శుక్రవారం మాస్కోలో పుతిన్‌తో సమావేశమవడం తెల్సిందే. వాటికన్‌లో ట్రంప్‌తో భేటీ అనంతరం జెలెన్‌స్కీ సైతం సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘ఒక్కో అంశాన్ని సవివరంగా చర్చించాం. 

వీటిపై సానుకూల ఫలితాలను ఆశిస్తున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం, సంపూర్ణ, బేషరతు కాల్పుల విరమణ, మళ్లీ యుద్ధం రాకుండా నివారించే విశ్వసనీయమైన, శాశ్వత శాంతి మాకు కావాలి’అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అత్యంత కీలకమైన సమావేశాలు జరగనున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరుగనున్న భేటీపై ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఇది చారిత్రాత్మకంగా మారే అవకాశం ఉందన్నారు.

 అయితే, భేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించేలా రష్యాపై తక్షణమే ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శనివారం మరోసారి చర్చలు కొనసాగించాలని ట్రంప్, జెలెన్‌స్కీ నిర్ణయించుకున్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షభవనం ప్రతినిధి సెర్హి నికిఫొరోవ్‌ అంతకుముందు వెల్లడించారు. కానీ, పోప్‌ అంత్యక్రియలు ముగిసిన వెంటనే ట్రంప్‌ నేరుగా రోమ్‌ విమానాశ్రయం చేరుకుని, ఎయిర్‌ ఫోర్స్‌ విమానంలో అమెరికాకు బయలుదేరారు. దీంతో, రెండో సమావేశానికి అవకాశం లేకుండా పోయింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement