
అక్రమ వలసదారులకు యూకే ప్రధాని స్టార్మర్ హెచ్చరిక
‘డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్’తాజాస్కీంలో భారత్ సహా 23 దేశాలు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై వేగంగా చర్యలు
లండన్: అక్రమ వలసదారులకు యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ గట్టి హెచ్చరికలు చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తక్షణమే బహిష్కరించి, ఆ తర్వాతే ఆన్‌లైన్‌లో విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ‘డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్’స్కీంలో ఉన్న దేశాల సంఖ్య 8 నుంచి భారత్ సహా 23కు పెంచిన నేపథ్యంలో స్టార్మర్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
‘మా దేశంలోకి మీరు అక్రమంగా వచ్చినట్లయితే నేరానికి పాల్పడినట్లే. ఇందుకుగాను డిటెన్షన్‌ను, బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వేగంగా మిమ్మల్ని వెనక్కి పంపివేస్తాం’అని సోమవారం ఎక్స్‌లో స్టార్మర్ పేర్కొన్నారు. ‘ఎంతో కాలంగా విదేశీ నేరగాళ్లు మా వలస వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. వారి అప్పీల్స్ వాయిదా పడుతుండటంతో యూకేలో నెలలు, సంవత్సరాల తరబడి తిష్ట వేసుకుంటున్నారు. దీనికి ముగింపు పలుకుతాం’అని ఆయన పేర్కొన్నారు. తాజాగా పెంచిన జాబితాలోని 23 దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తక్షణమే దేశం నుంచి వెనక్కి పంపించివేస్తారు.
వారి అప్పీళ్లపై వీడియో లింక్ ద్వారా విచారణ చేపడతారు. విదేశీ నేరగాళ్లను తొలగించడం, డిటెన్షన్ సెంటర్లపై ఒత్తిడి తగ్గించడం, ప్రజా ధనాన్ని ఆదా చేయడమే తమ లక్ష్యమని యూకే ప్రభుత్వం అంటోంది. 2023లో మొదటగా ఈ చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు అందులోని జాబితాలో ఆల్బేనియా, కొసావో, నైజీరియా, ఎస్టోనియా దేశాలే ఉన్నాయి. విస్తరించిన జాబితాలో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, మలేసియా, కెన్యా, ఉగాండా తదితర దేశాలను చేర్చారు. దీనిపై ఆయా దేశాలతో యూకే అధికారులు చర్చలు ప్రారంభించారు. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సైతం ఇప్పటికే విదేశీయులను వెనక్కి పంపే కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తుండటం తెల్సిందే.
భారతీయులు సహా వందలాది మంది అరెస్ట్
దేశవ్యాప్తంగా అక్రమంగా పనిచేస్తున్న భారతీయులు సహా వందలాదిమందిని యూకే ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా బైక్‌లపై డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. జూలై 20–27 తేదీల మధ్యన చేపట్టిన తనిఖీల్లో 1,780 అక్రమంగా పనిచేసే డెలివరీ ఏజెంట్లు, 280 మంది అనుమతులు లేకుండా పనులు చేసే వలసదారులు పట్టుబడ్డారని వెల్లడించారు. హిల్లింగ్‌డన్‌లో ఏడుగురు భారతీయులు దొరికారని, వీరిలో ఐదుగురిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలిపారు.