ఉక్రెయిన్ వ్యాప్తంగా రాత్రంగా మోగిన సైరన్లు
కీవ్: రష్యా మరోసారి పేట్రేగిపోయింది. ఉక్రెయిన్‌పైకి పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగుతూనే ఉన్నాయి. రష్యా మొత్తం 51 మిస్సైళ్లు, 653 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. వీటిలో 30 క్షిపణుల, 585 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకున్నాయంది.
మిగతా డ్రోన్లు, క్షిపణులతో కనీసం 29 ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని పేర్కొంది. తమ ఇంధన మౌలిక వనరులను రష్యా లక్ష్యంగా చేసుకుందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. కీవ్ ప్రాంతంలోని ఫాస్టివ్ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్ డ్రోన్ దాడితో పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. వివిధ ఘటనల్లో 8 మంది వరకు గాయాలపాలయ్యారన్నారు.
ఇలా ఉండగా, నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు, సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో అమెరికా, ఉక్రెయిన్ మధ్య రెండు రోజులుగా చర్చలు జరిగాయి. ఇందులో అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జెర్‌డ్ కుష్నర్, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్, ఉక్రెయిన్ ప్రతినిధి రుస్తెమ్ ఉమెరోవ్, ఆండ్రీ హనటోవ్‌లు పాల్గొంటున్నారు. అయితే, యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా నిజంగా సిద్ధంగా ఉంటేనే ఈ సంప్రదింపులతో సరైన ఫలితం లభించినట్లవుతుందని వారంటున్నారు. మూడో రోజు శనివారం కూడా వీరి చర్చలు కొనసాగుతున్నాయి.


