
శాస్త్ర, సాంకేతిక నిపుణులకు వీసా ఫీజు మినహాయింపు!
లండన్: అత్యంత ప్రతిభావంతులను ఒడిసిపట్టేందుకు చైనా మాదిరిగా బ్రిటన్ సైతం వడివడిగా పావులు కదుపుతోంది. హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును అమెరికా ప్రభుత్వం ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంతో సైన్స్, టెక్నాలజీ నిపుణుల చూపు ఇతర దేశాలపై పడనుంది. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్రిటన్ ఆరాటపడుతోంది. ఈ దిశగా ఇప్పటికే వ్యూహరచన చేసినట్లు లండన్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలోని విశ్వసనీయ వర్గాలువెల్లడించాయి.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సృజనాత్మకత, నవ్యావిష్కరణలు చూపే ప్రతిభావంతులను తమ దేశంలోకి ఆకర్షించేందుకు వీలుగా వాళ్ల వీసా ఫీజును పూర్తిగా మాఫీ చేయాలని ప్రధాని కీర్ స్టార్మర్ సారథ్యంలోని యూకే సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే స్టార్మర్ ఈ ఏడాది తొలినాళ్లలో 5.4 కోట్ల బ్రిటిష్ పౌండ్ల మూలనిధితో ‘ది గ్లోబల్ టాలెంట్ టాస్క్‌ఫోర్స్’ విభాగాన్ని ఏర్పాటుచేశారు.
బ్రిటన్ ఆర్థికాభివృద్ధిని ఉరకలెత్తించేలా నవ్యావిష్కరణలు చేసే యువ ప్రతిభావంతులకు దేశంలోకి సాదర స్వాగతం పలకాలని ప్రభుత్వం యోచిస్తోంది. ట్రంప్ జాత్యహంకారంతో రంకెలేస్తూ హెచ్–1బీ వీసా ఫీజుల మాటున విదేశీ ప్రతిభావంతులను తరిమికొడుతున్న నేపథ్యంలో వాళ్లకు ఆశ్రయమిచ్చి దేశ పురోభివృద్ధికి అక్కరకొచ్చేలా ఉపయోగించుకోవాలని స్టార్మర్ ప్రభుత్వం ఆశిస్తోంది.
ఇందులోభాగంగానే వీసా ప్రక్రియను వేగవంతంచేసి అడ్మినిస్ట్రేషన్ చార్జీలను రద్దుచేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత బ్రిటన్‌లో వీసా ఫీజు 1,000 పౌండ్లుగా ఉంది. మరోవైపు 2020లో బ్రిటన్ గ్లోబల్ టాలెంట్ వీసాను తీసుకొచ్చింది. దీని కోసం 766 పౌండ్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆరోగ్యసేవలు కావాలంటే ఆమేరకు సర్‌చార్జ్‌లు కలుపుకుంటే ఒక్కో వీసాదారుడు 1,035 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది.
జీవిత భాగస్వామి, సంతానానికి సైతం ఇవే చార్జీలు వర్తిస్తాయి. అయితే ప్రపంచంలోనే సైన్స్, టెక్నాలజీ రంగాలకు సంబంధించి టాప్–5 విశ్వవిద్యాల యాల్లో అభ్యసించిన, ప్రతిష్టాత్మక విద్య, ఉపాధిరంగ అవార్డ్‌లను గెల్చుకున్న వ్యక్తులకు ఎలాంటి వీసా ఫీజులను వసూలుచేయకూడదని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థికాభివృద్ధి పెంపే లక్ష్యంగా అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, టీచర్లు, డిజిటల్ రంగ నిపుణుల వీసా ఫీజును మాఫీ చేయాలని భావిస్తున్నారు.