
తుర్కియేలో తవ్వకాల్లో దొరికింది
ఇస్తాంబుల్: తుర్కియే(టర్కీ)లో వేలాది సంవత్సరాల క్రితం నాటి అరుదైన బంగారు ఆభరణం, విలువైన పచ్చరాయి(జేడ్) తవ్వకాల్లో బయటపడ్డాయి. ప్రాచీన నగరం ‘ట్రోయ్’లో పురావస్తు పరిశోధకులు తవ్వకాలు సాగిస్తుండగా, ఇవి బహిర్గతమయ్యాయి. గత శతాబ్ద కాలంలో తవ్వకాల్లో వెలుగుచూసిన అత్యంత విలువైన నిధి ఇదేనని అంచనా వేస్తున్నారు. ఈ రెండు వస్తువులు ప్రపంచ పరిశోధకులు దృష్టిని ఆకర్శిస్తున్నాయి.
‘ట్రోయ్’లో గత 160 ఏళ్లుగా తవ్వకాలు జరుగుతుండడం విశేషం. తాజాగా బయటపడిన బంగారు ఆభరణం క్రీస్తుపూర్వం 2,500 ఏళ్ల నాటిదని, కంచు యుగంలో అప్పటి ప్రజలు ఛాతీపై ధరించి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఒక తీగకు అతికించిన నాలుగు వలయాల ఆకారంలో ఉంది. ఈ ఆభరణం 4,500 ఏళ్ల క్రితం నాటిది కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పట్లో బంగారం వినియోగం అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రోయ్‌లో జరిగిన తవ్వకాల్లో ఆ ఆభరణంతోపాటు ఒక లోహపు పిన్ను, పచ్చరాయి కూడా బయటపడ్డాయి.
ఈ రాయి కూడా 4,500 సంవత్సరాల క్రితం నాటిదని గుర్తించినట్లు తుర్కియే పర్యాటక శాఖ మంత్రి మెహ్‌మెట్ నూరీ ఎర్సో చెప్పారు. దీన్ని ఆ కాలంలో అత్యంత విలాసవంతమైన వస్తువుగా భావించేవారని, ధనవంతులు ఉంగరంలాగా ధరించేవారని పేర్కొన్నారు. తవ్వకాల్లో దొరికిన విలువైన ఈ నిధిని ట్రోయ్ మ్యూజియంలో ప్రదర్శిస్తామని, ప్రజలు తిలకించవచ్చని చెప్పారు. ప్రస్తుత వీటి విలువ తేల్చే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు. ట్రోయ్ నగరానికి ఘనమైన చరిత్రే ఉంది. కంచు యుగంలో ఇక్కడ వ్యాపారం బాగా జరిగేది. విదేశాల నుంచి వర్తకులు వచ్చేవారు. విలువైన వస్తువుల క్రయవిక్రయాలు జోరుగా సాగేవి. ట్రోయ్ భూగర్భంలో అత్యంత విలువైన నిధి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.