అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ టంప్‌కు నోబెల్ బహుమతిపై ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎలాగైనా ప్రపంచశాంతి బహుమతి సాధించాలని ట్రంప్ ఎక్కని గడపా లేదు.. చేయని రచ్చా లేదు. ఎలాగైనా ఈ అవార్డు తనకు ప్రకటించాలంటూ పలుసార్లు బహిరంగ ప్రకటన సైతం చేశారు. కానీ నోబెల్ మాత్రం ట్రంప్‌కు దక్కలేదు.
తాజాగా ట్రంప్ మరోసారి నోబెల్‌పై తనకు ప్రకటించకపోవడంపై తనకున్న అక్కసును వెల్లగక్కారు. తాజాగా నార్వే ప్రధాని జోనస్ గహర్‌కు ట్రంప్ లేఖ రాశారు. అందులో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విధ్వంసానికి కారణం ఆదేశం తనకు నోబెల్ ప్రకటించకపోవడమేనన్నారు. అందువల్లే తన రూట్ మార్చానని తెలిపారు. శాంతిని వదిలి యుద్ధ బాట పట్టినట్లు పేర్కొన్నారు.
ఆలేఖలో ట్రంప్ ... "నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. అయినా మీ దేశం నన్ను శాంతిదూతగా గుర్తించలేదు. అందుకే ఇక నేను శాంతి గురించి ఆలోచించాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను కేవలం అమెరికాకు ఏది లాభం చేకురుస్తోంది అదే చేస్తాను" అని ట్రంప్ లేఖలో అన్నారు. గ్రీన్‌లాండ్‌కు ఎప్పటికైనా చైనా, రష్యాల నుంచి ముప్పు పొంచి ఉంది ఈ నేపథ్యంలో ఆ భూమిపై వారికి యాజమాన్య హక్కులు ఎలా ఉంటాయి అని ట్రంప్ ప్రశ్నించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ పడవలు దిగాయి. మా భూభాగంలో కూడా పడవలు దిగాయి. అంతే .. ఆ భూమిపై యాజమాన్య పత్రాలు ఆదేశానికి లేవు అని అన్నారు.
అయితే గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆక్రమించుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయాన్ని డెన్మార్క్‌తో సహా ఇతర నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆ నాటో దేశాలపై 10 శాతం సుంకం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. నోబెల్ బహుమతి ప్రకటన అనేది పూర్తిగా నోబెల్ కమిటీ ఎంపిక మాత్రమే అక్కడి ప్రభుత్వానికి అందులో ఎటువంటి జోక్యం ఉండదు.


