వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం ముగింపుకు శ్రీకారం చుడుతూ.. ఈనెల 19న అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మరో రెండు రోజుల్లో శాంతి ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయని, ఆ ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై బాంబులు వేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. వంద రోజులకు పైగా యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో జూన్ 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అమెరికా-ఇరాన్‌ల మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది. మధ్యవర్తులుగా పాకిస్థాన్, ఖతర్ వ్యవహరిస్తున్నాయి. రెండు రోజులలోనే ఒప్పందంపై సంతకాలు జరగనున్న తరుణంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఒప్పందం కుదిరిన వెంటనే హర్మూజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ ఒప్పందానికి అణు ఆయుధాలే సాక్షాలు. ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగవు’ అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణు ప్రోగ్రామ్ నిలిపివేయాలని, యురేనియం నిల్వలను తొలగించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఒప్పుకుంటూ ఇరాన్ ఒప్పందంపై సంతకాలు చేయాలి. లేదంటే ఆ దేశంపై బాంబులు వేయిస్తామని స్పష్టం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ.. ‘ఎంఓయూ కేవలం ప్రారంభం మాత్రమే. అణు ప్రోగ్రామ్‌పై భవిష్యత్ చర్చలు కొనసాగుతాయి అని అన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే యుద్ధం నిలిచిపోతుందని, హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు ఇరాన్-ఒమాన్ ఆధ్వర్యంలో కొనసాగుతాయని ఆయన తెలిపారు.
ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా లెబనాన్‌తో సహా అన్ని ఫ్రంట్‌లలో యుద్ధం తక్షణమే నిలుస్తుందని, నావికాదళ ఆంక్షలు తొలగించబడతాయని ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాకు హర్మూజ్ జలసంధి కీలకమని, ఒప్పందం తర్వాత చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ యుద్ధంలో ధ్వంసమైన గ్యాస్, ఆయిల్ ఫీల్డ్స్ పునరుద్ధరణకు నెలలు పట్టవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు.


