హర్మూజ్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన | Trump Announces Iran Peace Deal And Reopening Of Hormuz Strait, Iran Responds Cautiously | Sakshi
Sakshi News home page

హర్మూజ్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన

Jun 15 2026 10:41 PM | Updated on Jun 16 2026 2:01 PM

Trump says Strait of Hormuz will be completely open by friday

పశ్చిమాసియాలో గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయ్యిందని, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి శుక్రవారం నుంచి పూర్తిగా తెరుచుకోనుందని వెల్లడించారు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్‌.. "ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌తో ఒప్పందం పూర్తయ్యింది. అందరికీ అభినందనలు. హర్మూజ్‌ జలసంధిని ఎలాంటి టోల్‌ లేకుండా తెరవడానికి అనుమతి ఇస్తున్నాను. అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా వెంటనే ఎత్తివేస్తున్నాను. ప్రపంచ దేశాల నౌకలు తమ ప్రయాణాలను ప్రారంభించవచ్చు. చమురు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి" అని పేర్కొన్నారు.

అయితే ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ మాత్రం జాగ్రత్తగా స్పందించింది. ప్రస్తుతం కుదిరింది కేవలం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమేనని, అసలు ఒప్పందంపై చర్చలు ఆ తర్వాత అమల్లోకి వచ్చే 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో జరగనున్నాయని స్పష్టం చేసింది. అమెరికాపై తమకు ఇంకా అపనమ్మకం కొనసాగుతోందని మరోసారి పేర్కొంది.

కాగా, ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయోతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 4న టెహ్రాన్‌లోని ఇమామ్‌ ఖమేనీ మొసల్లా ప్రార్థనా మందిరంలో వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం టెహ్రాన్‌, ఖోమ్‌ నగరాల్లో అంతిమయాత్రలు సాగనున్నాయి. చివరి అంత్యక్రియలు జూలై 9న మష్‌హద్‌లో నిర్వహించి, అదే రోజు ఇమామ్‌ రిజా పవిత్ర స్థలంలో ఖమేనీకి ఖననం చేయనున్నట్లు ఇరాన్‌ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement