
నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు(Trump reacts On Nobel Miss). వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు ఆ గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు గతంలో తాను పలు సందర్భాల్లో సహాయం చేశానని ట్రంప్ అన్నారు. అలాగే, తన నాయకత్వంలో ఏడు యుద్ధాలను ముగించానని.. అందుకోసమైనా తనకు నోబెల్ రావాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి(Maria Corina Machado) ఇవాళ నాకు ఫోన్ చేశారు. మీ గౌరవార్థమే నేను ఈ బహుమతిని అందుకున్నానని, మీరు దీనికి అన్నివిధాల అర్హులు అని ఆమె నాతో అన్నారు. అప్పుడు.. అలాగైతే నాకే ఇవ్వండి అని మాత్రం నేను అనలేదు. కానీ, ఆమె అలా అనేసి ఉండొచ్చు.. అంటూ సరదా వ్యాఖ్యలు చేయడంతో అక్కడ నవ్వులు పూశాయి.
మరియా కొరీనా మచాడోకు గతంలో ఎన్నోసార్లు నా సాయం అందుకుంది. వెనిజులా సంక్షోభ సమయంలో ఎంతో సహాయం చేశా. ఏదైతేనేం లక్షల మందిని రక్షించా.. అందుకు సంతోషంగా ఉంది’’ అని ట్రంప్ వైట్‌హౌజ్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ వస్తుందని చెప్పారు. కానీ అది పెద్ద వ్యవహారం. అయినా నేను ఏడు యుద్ధాలు ఆపాను. అందుకోసమైనా తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉండాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. మచాడో తన నోబెల్ బహుమతిని వెనిజులా ప్రజలకు, ట్రంప్‌కు అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనిజులా ప్రజల బాధలకు, అలాగే మా ఉద్యమానికి ట్రంప్ ఇచ్చిన కీలక మద్దతుకు ఈ బహుమతిని అంకితం చేస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో ఆమె ఓ కృతజ్ఞత పోస్ట్ ఉంచారు. అయితే..
ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై వైట్ హౌస్ భగ్గుమంది(White House Slams Nobel Committee for Trump Peace Prize Miss). నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలను ప్రాధాన్యంగా చూసింది అని విమర్శించింది. ఈ మేరకు వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ మానవతావాది. ఆయనకు మంచి హృదయం ఉంది. కానీ, నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుందని ఇది నిరూపించింది. అయినా కూడా ట్రంప్ శాంతి ఒప్పందాలు చేయడం, యుద్ధాలను ముగించడం, ప్రాణాలను రక్షించడం ఆపబోరు అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చైనాపై పెద్దన్నకు కోపమొచ్చింది! నవంబర్ 1 నుంచి..