
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనాపై అదనంగా 100 శాతం సుంకాన్ని ప్రకటించారు. జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు. త్వరలో దక్షిణ కొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు ఖనిజాల ఎగుమతులపై చైనా పలు ఆంక్షలు విధించడంపై ట్రంప్ మండిపడ్డారు. ఇటువంటి సమయంలో జిన్‌పింగ్‌తో భేటీకి తగిన కారణం కనిపించడం లేదని పేర్కొన్నారు. దీనికి ప్రతిచర్యగా చైనా ఉత్పత్తులపై మళ్లీ భారీగా సుంకాలు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
‘చైనాలో విచిత్రమైన విషయాలు చోటుచేసుకుంటున్నాయి. అరుదైన ఖనిజాలపై పలు ఆంక్షలు విధించాలనుకుంటున్నారు. దీనిపై ప్రపంచం మొత్తానికి లేఖలు పంపుతున్నారు. అందరికీ శత్రువులుగా మారుతున్నారు. చైనాతో తాము కొంతకాలంగా తాము మంచి సంబంధాలే కొనసాగించినప్పటికీ.. ఇటీవలి కాలంలో వారి చర్యలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అందుకే దక్షిణ కొరియా పర్యటనలో జిన్‌పింగ్‌తో సమావేశం కావడానికి కారణాలు కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే అమెరికా దిగుమతి చేసుకునే చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించాలనుకుంటున్నాం’ అంటూ అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. బీజింగ్ అసాధారణ రీతిలో దూకుడుగా వ్యవహరించినందుకు ప్రతీకారంగా అదనపు సుంకాలు విధిస్తామన్నారు. వీటికి తోడు అదనంగా అమెరికా ఎగుమతి నియంత్రణలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా- చైనా మధ్య ఉధృతంగా మారిన వాణిజ్య యుద్ధం తిరిగి రాజుకోవడంతో స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఫెంటానిల్ వాణిజ్యంలో బీజింగ్ సహాయం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. అనంతరం చైనా వస్తువులపై అదనపు సుంకాలు విధించారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో చైనాను సుంకాల హెచ్చింపుతో బెదిరించారు. ప్రపంచాన్ని తన బందీగా ఉంచడానికి చైనాను అనుమతించకూడదని ట్రంప్ రాశారు. చైనా వైఖరిని శత్రుత్వ ధోరణిగా అభివర్ణించారు.