
జొహన్నెస్‌బర్గ్: డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం యూఎస్ ఎయిడ్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెలవప్ మెంట్) నిధులను పూర్తిగా నిలిపివేసింది. ఇందుకు సంబంధించిన యంత్రాంగాన్ని పూర్తిగా తొలగించింది. ఈ చర్య ప్రపంచ వ్యాప్తంగా ‘యూఎస్ ఎయిడ్’సాయం అందుకునే పలు దేశాలతోపాటు వివిధ కీలకమైన సంస్థలపైనా పడింది.
ముఖ్యంగా మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన హెచ్‌ఐవీకి విరుగుడును తీసుకువచ్చే ప్రయత్నాలకు ట్రంప్ చర్య ఆఖరి క్షణంలో అడ్డుకట్ట వేసింది. దక్షిణాఫ్రికాలో బ్రిలియంట్ కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఐవీ టీకా ‘లెనకపవిర్’ను రూపొందించారు. దీనికి అమెరికా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆమోదముద్ర వేసింది. మరో వారం రోజుల్లో దక్షిణాఫ్రికాలోని యువతపై టీకా క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ సమయంలో పిడుగులాంటి వార్త వారికి అందింది. అదే యూఎస్ ఎయిడ్ నిలిపివేత. దీంతో, ఈ కార్యక్రమం కింద పనిచేస్తున్న దాదాపు 100 మంది పరిశోధకులు హతాశులయ్యారు. నిధుల్లేకుండా వారు ముందుకు సాగేందుకు ఏమాత్రం అవకాశాల్లేవు. దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని సాయం కోరినా ఫలితం కనిపించలేదు. ఇప్పుడిక అన్ని కార్యక్రమాలను నిలిపివేయడం మినహా గత్యంతరం లేదని వారంటున్నారు. బ్రిలియంట్ కార్యక్రమం చీఫ్ గ్లెండా గ్రె..‘హెచ్‌ఐవీకి విరుగుడు కనుగొనడంలో ఆఫ్రికా ఖండం చాలా కీలకమైంది.హెచ్‌ఐవీని అరికట్టేందుకు లెనకపవిర్ టీకాను ఏడాదిలో రెండు సార్లు ఇస్తే సరిపోతుంది.
ప్రపంచంలోనే ఇలాంటి మొట్టమొదటి వ్యాక్సిన్ ఇది. అవకాశమిస్తే ట్రయల్స్‌ను ప్రపంచంలోనే అందరికంటే చౌకగా, సమర్థంగా, వేగవంతంగా పూర్తి చేయగలం’అని ఆమె అన్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో నోవావ్యాక్స్ టీకా తయారీలో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కీలకంగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. అమెరికా నిర్ణయం ఫలితంగా సుమారు 8 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు ఉద్యోగాలు కోల్పోయారు. శ్వేత వర్ణం వారిని వేధిస్తున్నామంటూ అమెరికా ప్రభుత్వం తమపై అనవసర ఆరోపణలు మోపి ఎంతో కీలకమైన ఆరోగ్యరంగానికి నిధులను ఆపేయడం అన్యాయమని దక్షిణాఫ్రికా ప్రభుత్వం వాపోతోంది.