breaking news
HIV vaccine
-
యూఎస్ ఎయిడ్ కోత.. దక్షిణాఫ్రికాలో నిలిచిన హెచ్ఐవీ టీకా ట్రయల్స్
జొహన్నెస్‌బర్గ్: డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం యూఎస్ ఎయిడ్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెలవప్ మెంట్) నిధులను పూర్తిగా నిలిపివేసింది. ఇందుకు సంబంధించిన యంత్రాంగాన్ని పూర్తిగా తొలగించింది. ఈ చర్య ప్రపంచ వ్యాప్తంగా ‘యూఎస్ ఎయిడ్’సాయం అందుకునే పలు దేశాలతోపాటు వివిధ కీలకమైన సంస్థలపైనా పడింది. ముఖ్యంగా మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన హెచ్ఐవీకి విరుగుడును తీసుకువచ్చే ప్రయత్నాలకు ట్రంప్ చర్య ఆఖరి క్షణంలో అడ్డుకట్ట వేసింది. దక్షిణాఫ్రికాలో బ్రిలియంట్ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవీ టీకా ‘లెనకపవిర్’ను రూపొందించారు. దీనికి అమెరికా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆమోదముద్ర వేసింది. మరో వారం రోజుల్లో దక్షిణాఫ్రికాలోని యువతపై టీకా క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో పిడుగులాంటి వార్త వారికి అందింది. అదే యూఎస్ ఎయిడ్ నిలిపివేత. దీంతో, ఈ కార్యక్రమం కింద పనిచేస్తున్న దాదాపు 100 మంది పరిశోధకులు హతాశులయ్యారు. నిధుల్లేకుండా వారు ముందుకు సాగేందుకు ఏమాత్రం అవకాశాల్లేవు. దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని సాయం కోరినా ఫలితం కనిపించలేదు. ఇప్పుడిక అన్ని కార్యక్రమాలను నిలిపివేయడం మినహా గత్యంతరం లేదని వారంటున్నారు. బ్రిలియంట్ కార్యక్రమం చీఫ్ గ్లెండా గ్రె..‘హెచ్ఐవీకి విరుగుడు కనుగొనడంలో ఆఫ్రికా ఖండం చాలా కీలకమైంది.హెచ్ఐవీని అరికట్టేందుకు లెనకపవిర్ టీకాను ఏడాదిలో రెండు సార్లు ఇస్తే సరిపోతుంది. ప్రపంచంలోనే ఇలాంటి మొట్టమొదటి వ్యాక్సిన్ ఇది. అవకాశమిస్తే ట్రయల్స్‌ను ప్రపంచంలోనే అందరికంటే చౌకగా, సమర్థంగా, వేగవంతంగా పూర్తి చేయగలం’అని ఆమె అన్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో నోవావ్యాక్స్ టీకా తయారీలో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కీలకంగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. అమెరికా నిర్ణయం ఫలితంగా సుమారు 8 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు ఉద్యోగాలు కోల్పోయారు. శ్వేత వర్ణం వారిని వేధిస్తున్నామంటూ అమెరికా ప్రభుత్వం తమపై అనవసర ఆరోపణలు మోపి ఎంతో కీలకమైన ఆరోగ్యరంగానికి నిధులను ఆపేయడం అన్యాయమని దక్షిణాఫ్రికా ప్రభుత్వం వాపోతోంది. -
ఆవులతో హెచ్ఐవీ వ్యాక్సిన్?
హెచ్ఐవీని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సరికొత్తగా ఆవుతో హెచ్ఐవీ వ్యాక్సిన్ తయారు చేయొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. హెచ్ఐవీ వైరస్ తాలూకూ ప్రొటీన్లను ఆవుల్లోకి ఎక్కించినప్పుడు వాటిల్లో తయారైన యాంటీబాడీలతో హెచ్ఐవీని నిరోధించొచ్చని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఓ ప్రయోగం ద్వారా తెలిసింది. ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్ఐవీ వైరస్ తరచూ తన రూపం మార్చుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. వ్యాధికి తగిన మందు లభించకపోవడానికి కారణమిదే. అయితే ఈ వ్యాధి మిగిలిన జంతువులకు సోకినా.. ఆవులకు మాత్రం సోకదు. దీనికి కారణమేమిటో తెలుసుకునేందుకు స్క్రిప్స్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం చేశారు. హెచ్ఐవీ వైరస్ ఉపరితలాన్ని పోలిన ప్రొటీన్‌ను ఆవుల్లోకి ఎక్కించారు. ఆ తర్వాత ఏడాది పాటు అప్పుడప్పుడూ ఆవుల రక్తం సేకరించి యాంటీబాడీలను వేరు చేశారు. ఈ యాంటీబాడీలు కణాల్లోకి హెచ్ఐవీ వైరస్ చేరకుండా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ యాంటీబాడీలు అనేక ఇతర వైరస్‌లను కూడా నిరోధిస్తున్నట్లు తెలిసింది. ఆవుల జీర్ణవ్యవస్థ ప్రత్యేక నిర్మాణం.. నిత్యం అనేక రకాల సూక్ష్మజీవులతో దాని రోగ నిరోధక వ్యవస్థ పోరాడుతూ ఉండటం వంటి కారణాల వల్ల ఈ క్షీరదాలు ఉత్పత్తి చేసే యాంటీబాడీలు చాలా పొడవుగా ఉంటాయని.. అందువల్లే ఇవి హెచ్ఐవీని అడ్డుకోగలుగుతున్నాయని ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్‌కు చెందిన శాస్త్రవేత్త డెవిన్ సోక్ చెబుతున్నారు. ఆవులకు ఉన్న ఈ వినూత్న లక్షణం ఆధారంగా భవిష్యత్తులో హెచ్ఐవీకి మాత్రమే కాకుండా.. అనేక ఇతర వైరస్ సంబంధిత వ్యాధులకూ మెరుగైన చికిత్స లభించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
త్వరలో హెచ్ఐవీ టీకా!
వాషింగ్టన్: హెచ్ఐవీని నియంత్రించే అధునాతన కొత్త టీకాలను అభివృద్ధి చేయడంలో చివరి అంకానికి దక్షిణాఫ్రికాలో శ్రీకారం చుట్టారు. ‘హెచ్ఐవీ వ్యాక్సిన్ ట్రయల్స్ నెట్వర్క్’లో చివరిదైన ‘హెచ్‌వీటీఎన్ 702’ అనే టీకాను ప్రస్తుతం పరీక్షించనున్నారు. ఇంతకుముందు పరీక్షించిన టీకాలు సత్ఫలితానివ్వడం తెలిసిందే. హెవీటీఎన్ 702 విజయవంతమైతే హెచ్ఐవీని నియంత్రించడానికి మంచి టీకా దొరికినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో 5,400 మంది హెచ్ఐవీ సోకిన స్త్రీ, పురుషులపై టీకాలను పరీక్షించనున్నట్లు అమెరికా ఎన్ఐఏఐడీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్సియస్ డిసీజెస్) డెరైక్టర్ ఆంథోని ఫాసీ వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని 15 ప్రాంతాల్లో ఈ టీకాను పరీక్షిస్తున్నారు. 2020 చివరికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.