
వియత్నాంలో 34 మంది జలసమాధి
హా లాంగ్ బే(వియత్నాం): వియత్నాంలో అకస్మాత్తుగా విరుచుకుపడిన తుపానులో చిక్కుకుపోయిన ఒక పర్యాటకుల పడవ నీటిలో మునిగిపోయింది. వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హా లాంగ్ బే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం పడవ మునిగిన ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది జాడ గల్లంతైంది.
విషయం తెల్సుకున్న వియత్నాం సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు తీవ్రతరం చేశాయి. 11 మందిని కాపాడారు. ప్రమాదం జరిగినప్పుడు ‘ది వండర్ సీ’బోటులో 48 మంది పర్యాటకులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. తుపాను కారణంగా పెనుగాలులు వీయడంతో ఆ గాలుల ధాటికి పడవ ఒక్కసారిగా పల్టీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
వియత్నాం రాజధాని హనోయీ నుంచి 20 మంది చిన్నారులతోకూడిన కొన్ని కుటుంబాలు సైతం ఇదే పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని వీఎన్ ఎక్స్‌ప్రెస్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. హా లాంగ్ బే ప్రాంతాన్ని ఇప్పటికే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడం తెల్సిందే. సతతహరిత అరణ్యాలకు, అందమైన నీలిరంగు బీచ్‌లకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. వారాంతం కావడంతో ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువైందని తెలుస్తోంది.
రెండేళ్ల క్రితం సైతం హా లాంగ్ బే సమీప ఖ్వాంగ్‌నిన్ ప్రావిన్సును యాగీ టైఫన్ అతలాకుతలం చేసంది. ఆనాడు ఈ ప్రావిన్సులో 30 పడవలు బోల్తాపడి నీటమునిగాయి. ఈ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారడం సాధారణమని ఇక్కడి స్థానికులు చెప్పారు. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత పర్యాటకులు మరింత అప్రమత్తంగా ఉండి తమ పర్యాటక షెడ్యూల్‌ను మార్చుకోవాలని స్థానికులు సూచించారు. వచ్చే వారం హా లాంగ్ బే తీర ప్రాంతాన్ని విఫా తుపాను తాకొచ్చని జాతీయ వాతావరణ అంచనా విభాగం ప్రకటించింది.