బ్యాంకాక్: ‘పట్టపగలే మద్యం సేవిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగితే రూ.27,500 జరిమానా తప్పదు’అంటూ థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగాన్ని నియంత్రించేందుకు కఠినమైన కొత్త చట్టాలను అమలు చేసింది.
పగటి మద్యం తాగాడాన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొత్త నిబంధనల ప్రకారం, నియమాలను ఉల్లంఘించిన వారికి రూ.27,500 (10,000 బాత్) వరకు జరిమానా విధించనున్నారు.
ఉదయం 2 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు మద్యం సేవించడం, విక్రయించడం నిషేదం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి థాయ్‌లాండ్ కరెన్సీలో 10,000 బాత్ (రూ.27,500కు పైగా) జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగాన్ని నియంత్రించడం ద్వారా సామాజిక సమస్యలు, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.
అయితే,థాయ్‌లాండ్ ప్రభుత్వ నిర్ణయంపై పర్యాటకులు పెదవి విరిస్తున్నారు. పర్యాటక రంగంలో మద్యం వినియోగం సాధారణంగా కనిపిస్తుంది. అయితే, ఈ కొత్త చట్టాలు పర్యాటకులపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. అక్కడి ప్రభుత్వం సైంతం పర్యాటకులు ఈ నిబంధనలను పాటించాల్సిందే, లేకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. పోలీసు, మునిసిపల్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రెస్టారెంట్లు, బార్లు, పబ్స్ వంటి ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. సీసీటీవీ ఆధారంగా మద్యం సేవనాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటారు.
థాయ్‌లాండ్ తీసుకున్న ఈ చర్యలు ఆసియా దేశాల్లో మద్యం నియంత్రణకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి. వివిధ దేశాల పర్యాటక సంస్థలు తమ కస్టమర్లకు ఈ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ కొత్త చట్టాల అమలుతో థాయ్‌లాండ్‌లో మద్యం వినియోగం నియంత్రణకు గట్టి అడుగు పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు, పర్యాటకులు ఈ నిబంధనలను గౌరవించి, సురక్షితంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.


