హైలెస్స రికార్డు..
భారీ నౌక.. అందులో 130 మంది ప్రయాణికులు.. మొత్తంగా 1.18 లక్షల కిలోల బరువు. అయితే, కెనడాకు చెందిన వెస్లీ మూస్.. నౌకకు అలా తాడుకట్టి ఇలా ఒడ్డుకు(65 అడుగుల దూరం) లాక్కొచ్చేశాడు. తద్వారా అమెరికాలో జరిగిన స్ట్రాంగ్‌మన్ చాంపియన్స్ లీగ్‌ను గెలుచుకోవడంతోపాటు గిన్నిస్ బుక్‌లోకి కూడా ఎక్కాడు. ఇందుకోసం 81 సెకన్ల సమయం తీసుకున్నాడు. తన క్రేజీ కలలను నెరవేర్చుకోవడంలో తన భార్య ఎంతగానో సహకరించిందంటూ కృతజ్ఞతలు చెప్పాడు.

గుండమ్మ కథ
ఆయన రికార్డులను ఊదిపారేస్తే.. ఈవిడ ఎత్తిపారేస్తుంది. గుండ్లు ఎత్తడంలో ఈ గుండమ్మ ఫేమస్ అట. ఆస్ట్రేలియాకు చెందిన నికోల్ ఏకంగా 180 కిలోల గుండును ఎత్తడం ద్వారా అంతటి బరువున్న గుండును ఎత్తిన మహిళగా గిన్నిస్ రికార్డును సాధించింది. చిన్నప్పుడు అద్భుతాలు సాధించిన మనుషుల కథలను చదివి.. తానూ ఒక రోజు అలా అవ్వాలని నికోల్ కలలుగనేదట. మనకీ అబ్దుల్ కలాం చెప్పారు. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అని. మనం మొదటి సగం దగ్గరే ఆగిపోతున్నాం..
మారుదామా మరి..

బబుల్‌ను చూస్తే.. గమ్‌నుండడు..
బబుల్ గమ్‌లను చూస్తే అమెరికాకు చెందిన చాడ్ ఫెల్ అస్సలు గమ్మునుండడు. వాటితో రికార్డులను ఊదిపారేస్తాడు. ఎంతలా అంటే ఆయన రికార్డును మరెవరూ బద్దలు కొట్టలేనంతగా.. ఇంతకీ ఆ గిన్నిస్ రికార్డు ఎందులోనో తెలుసా? అతిపెద్ద బబుల్ గమ్ బుడగను ఊది పేల్చడంలో.. ఈయన ఏకంగా 20 అంగుళాల బబుల్‌గమ్ బుడగను ఊది.. ఇదిగో ఇలా పేల్చేశాడు. ఏదైతేనేం.. ఫెల్ రికార్డు సాధించి 20 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటివరకూ ఎవరూ దాన్ని బద్దలు కొట్టలేదట..
మీరు ట్రై చేసి చూస్తారా?


