
గోవా ఫుట్‌బాల్ క్లబ్‌తో తలపడనున్న అల్ నాసర్ క్లబ్
ఏఎఫ్‌సీ చాంపియన్స్ లీగ్ –2 షెడ్యూల్ విడుదల
చెన్నై: అంతా అనుకున్నట్లు జరిగితే... పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆటను భారత అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్‌సీ) చాంపియన్స్ లీగ్–2లో భాగంగా రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నాసర్ జట్టుతో గోవా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తలపడాల్సి ఉంది. దీంతో ఆ మ్యాచ్‌లో పాల్గొనేందుకు పోర్చుగల్ స్టార్ భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అయితే అల్ నాసర్ క్లబ్‌తో కాంట్రాక్ట్ ప్రకారం విదేశీ వేదికలపై జరిగే మ్యాచ్‌ల్లో రొనాల్డో పాల్గొనే అంశంలో కొన్ని సడలింపులు ఉన్నాయి.
మరి రొనాల్డో గోవా ఎఫ్‌సీతో మ్యాచ్ కోసం భారత్‌కు వస్తాడా లేదా అనేది త్వరలోనే తేలనుంది. ఏఎఫ్‌సీ చాంపియన్స్ లీగ్2కు సంబంధించిన ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ నుంచి గోవా ఎఫ్‌సీతో పాటు మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు పాల్గొననుంది. వచ్చే నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం 32 జట్లు పాల్గొననుండగా... వాటిని ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉన్నాయి. గ్రూప్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించనున్నాయి.
గత సీజన్‌లో లీగ్ షీల్డ్ దక్కించుకోవడం ద్వారా మోహన్ బగాన్ జట్టు నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించగా... ‘సూపర్ కప్’ గెలవడం ద్వారా గోవా ఎఫ్‌సీ ముందంజ వేసింది. ఏఎఫ్‌సీ చాంపియన్స్ లీగ్‌లో గోవా జట్టు పాల్గొనడం ఇది రెండోసారి. 2021లోనూ గోవా జట్టు ఈ టోర్నీలో ఆడింది. సెపె్టంబర్ 16న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్... వచ్చే ఏడాది మే 16న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. లీగ్‌లో భాగంగా... ఇంటాబయట మ్యాచ్‌లు జరగడం పరిపాటి కావడంతో గోవా ఎఫ్‌సీతో తలపడేందుకు అల్ నాసర్ తరఫున రొనాల్డో భారత్‌కు వస్తాడనే వార్తలు వ్యాపించాయి.
గ్రూప్ ‘సి’లో ఫూలద్ మొబారకేశ్ సెపాహన్ ఎస్‌సీ (ఇరాన్), అల్ హుసేన్ (జోర్డాన్), అహల్ ఎఫ్‌సీ (తుర్క్‌మెనిస్తాన్)తో కలిసి మోహన్ బగాన్ పోటీ పడనుంది. గ్రూప్ ‘డి’లో గోవా ఎఫ్‌సీతో పాటు అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా), అల్ జవ్రా ఎస్‌సీ (ఇరాక్), ఇస్తిక్లోల్ ఎఫ్‌సీ (తజకిస్తాన్) ఉన్నాయి.