
ఏడు దశాబ్దాల టోర్నీ చరిత్రలో తొలిసారి టైటిల్ సొంతం
ఫైనల్లో 5–0 గోల్స్ తేడాతో ఇంటర్ మిలాన్‌పై గెలుపు
మ్యూనిక్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్‌జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుది పోరులో పీఎస్‌జీ 5–0 గోల్స్ తేడాతో ఇంటర్ మిలాన్ జట్టుపై విజయం సాధించింది. పీఎస్‌జీ తరఫున డెసైర్ డౌ (20వ, 63వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో చెలరేగగా... అష్రఫ్ హాకిమి (12వ నిమిషంలో), ఖ్విచా క్వారట్స్‌ఖేలియా (73వ నిమిషంలో), సెన్నీ మయులు (86వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
మ్యాచ్ ఆద్యంతం పీఎస్‌జీ జట్టు ఆధిపత్యం కనబర్చగా... ఇటలీ క్లబ్ ఇంటర్ మిలాన్ జట్టు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. 60 శాతం బంతిని తమ ఆధినంలో పెట్టుకున్న పీఎస్‌జీ చిన్న చిన్న పాస్‌లతో ఫలితం రాబట్టింది. 70 ఏళ్ల చరిత్రగల యూరోపియన్ కప్ ఫైనల్లో ఇలా ఒక జట్టు ఏకపక్షంగా భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఇదే తొలిసారి.
పీఎస్‌జీకి ఇదే మొదటి యూరోపియన్ కప్ టైటిల్ కాగా... ఏడో ఫైనల్ ఆడిన ఇంటర్ మిలాన్ జట్టు నాలుగోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 1956లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో రియల్ మాడ్రిడ్ జట్టు విజేతగా నిలవగా... ఇప్పుడు పీఎస్‌జీ రూపంలో 24వ విజేత అవతరించింది. మ్యూనిక్ వేదికగా ఇప్పటి వరకు ఐదుసార్లు ఈ టోర్నీ ఫైనల్ జరగగా... ఐదుసార్లూ కొత్త విజేత ఆవిర్భవించడం విశేషం.