లంకలో మళ్లీ ఆందోళనలు.. ‘రణీల్‌ గో హోమ్‌’ నినాదాలతో దద్దరిల్లిన కొలంబో

Sri Lanka Crisis Anti Government Protest Razed Again In Colombo - Sakshi

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలాకనిపించటం లేదు. ఇటీవలే ఏర్పడిన కొత్త ప్రభుత్వంపైనా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని కొలంబోలో బుధవారం వందల మంది ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు రణీల్‌ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ‘రణీల్‌ గో హోమ్‌’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స పరిస్థితి ప్రస్తుత ప్రెసిడెంట్‌కూ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.   

ఈ నిరసనలను విపక్ష పార్టీలు, వాణిజ్య సంఘాలు, పౌర హక్కుల గ్రూప్‌లు సంయుక్తంగా నిర్వహించాయి. నగరంలోని అధ్యక్ష నివాసం, ఇతర మంత్రుల నివాసలు ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ‘ప్రజలు మూడుపూటల కడుపునిండా తినలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు సాయం చేయకపోగా.. భారీగా పన్నులు విధిస్తోంది. దీనికి పరిష్కారం కావాలి. అందుకోసం పోరాడుతూనే ఉంటాం.’అని టీచర్స్‌ యూనియన్‌ సెక్రెటరీ జోసేఫ్‌ స్టాలిన్‌ తెలిపారు. 

ఈ ఏడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి చమురు, ఆహార పదార్థాలు, కుకింగ్‌ గ్యాస్‌, ఔషధాల వంటి నిత్యావసరాల దిగుమతులకు సైతం డబ్బులు చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుని గత జూలైలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత రణీల్‌ విక్రమ సింఘే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన నవంబర్‌ 14న తొలి బడ్జెన్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు పన్నుల పెంపు సహా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఈ క్రమంలోనే ప్రజలు మళ్లీ ఆందోళనబాట పడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం వందల మంది కొలంబోలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా పట్టుకుని ‘రణీల్‌ గో హోమ్‌’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. నిరసనకారులను అణచివేసేందుకు తీవ్రవాద నిరోధక చట్టాలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: GOA New Rules: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top