
ఎర్రసముద్రంలో నౌకపై దాడిచేసి ముంచేసిన రెబల్స్
దుబాయ్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న గ్రీక్ దేశానికి చెందిన అంతర్జాతీయ సరకు రవాణా నౌక ‘ఎటరి్నటీ సి’పై హౌతీలు గ్రనేడ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడిచేశారు. దీంతో నౌకకు కిందవైపు భారీ రంధ్రం పడి సముద్రంలో మునిగిపోయింది. విషయం తెల్సుకున్న యురోపియన్ యూనియన్ నేవీ బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని 10 మంది నౌక సిబ్బందిని రక్షించాయి. అయితే ఆలోపే కొంతమంది సిబ్బందిని హౌతీలు కిడ్నాప్‌చేసి గుర్తుతెలియని చోటుకు తీసుకెళ్లారు.
లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక మునిగిన ఘటనలో ముగ్గురు సజీవసమాధి అయ్యారు. ఎర్రసముద్రంలో ఈ వారం వ్యవధిలో హౌతీలు ఇలా వాణిజ్యనౌకపై దాడిచేయడం ఇది రెండోసారి. హమాస్‌ను అంతమొందించేందుకు సాహసించిన ఇజ్రాయెల్‌పై కక్షతో హౌతీలు ఇలా పశి్చమదేశాలకు చెందిన నౌకలపై తరచూ దాడులకు పాల్పడుతున్నారు. ఎటరి్నటీ సి నౌక ఇజ్రాయెల్‌లోని ఎలాట్ ఓడరేవుకు వెళ్తుండగా ఇలా దాడికి గురైంది. ‘‘ పాలస్తీనియన్లకు మద్దతుగా మేం దాడులను కొనసాగిస్తాం. గాజా ఆక్రమణను ఇజ్రాయెల్ ఆపాల్సిందే’’ అని హౌతీలు బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు.