
ఐరాస వేదికగా పాకిస్తాన్‌ను కడిగిపారేసిన జై శంకర్
అలాంటి దేశాల్ని క్షమించేవారికి సైతం ఉగ్ర కాటు తప్పదని హెచ్చరిక
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి వేదికగా, ప్రపంచ దేశాల నేతల సాక్షిగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పొరుగు దేశం నైచ్యాన్ని మరోసారి తేటతెల్లం చేశారు. ఒక దేశం ఉగ్రవాదాన్ని తన విధానంగా ప్రకటించుకుందంటూ కడిగిపారేశారు. ఇలాంటి దేశాలను దగ్గరకు తీసుకునే దేశాలు సైతం ఉగ్ర కాటుకు గురికాక తప్పదని జై శంకర్ వ్యాఖ్యానించారు.
శనివారం రాత్రి ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మనం హక్కుల గురించి చెప్పేటప్పుడు ఉగ్రవాదం వంటి తీవ్రమైన సమస్యల్ని కూడా దీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలో అమాయక పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న ఉదంతమే సీమాంతర ఆటవిక ఉగ్రవాదానికి తాజా ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా బిందువుగా తయారైన పొరుగు దేశం నుంచి ఈ సవాల్‌ను భారత్ స్వాతంత్య్రం వచి్చననాటి నుంచి ఎదుర్కొంటూనే ఉంది. అంతర్జాతీయ ఉగ్ర సంస్థల్లో ప్రధానంగా ఉండేవన్నీ ఆ ఒక్క దేశం నుంచే పనిచేస్తున్నాయి. ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారంతా ఆ దేశస్తులే’అని జై శంకర్ అన్నారు. పహల్గాం దారుణం నేపథ్యంలో ఉగ్రవాదం నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుందని, ఉగ్రవాద సంస్థలను, దోషులను న్యాయం ముందు నిలబెట్టిందని చెప్పారు.
ఉగ్రవాదం ఉమ్మడి ముప్పు కాబట్టే దీనిపై జరిగే పోరులో ప్రపంచ దేశాల మధ్య సహకారం ఎంతో అవసరమన్నారు. దేశాలు ఉగ్రవాదాన్ని బహిరంగంగా తమ విధానంగా ప్రకటించినప్పుడు, ఉగ్రవాద కేంద్రాలు ఒక పరిశ్రమ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు, ఉగ్రవాదులను బహిరంగంగా కీర్తించినప్పుడు ప్రపంచ దేశాలు నిర్ద్వంద్వంగా ఖండించాలి. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని అడ్డుకోవాలి’అని కోరారు.
అదే సమయంలో, ఐరాస పనితీరును సైతం ఆయన ప్రశ్నించారు. నేటి అవసరాలకు అనుగుణంగా ఈ అంతర్జాతీయ వేదిక పనిచేస్తుందా అని మనం ప్రశ్నించుకోవాలన్నారు. ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత, శాశ్వతేతర సభ్యదేశాల సంఖ్య మరింత పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ తన ప్రజలను, వారి ప్రయోజనాలను దేశీయంగా, అంతర్జాతీయంగా పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. భారత్ గ్లోబల్ సౌత్‌కు గొంతుకగా ఉంటుందని జైశంకర్ స్పష్టం చేశారు.