
మాస్కో: అమెరికాతో కుదిరిన నూతన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం(న్యూ స్టార్ట్)గడువు ముగిసిన తర్వాత కూడా మరో ఏడాది పాటు అణ్వాయుధ పరిమితులకు కట్టుబడి ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. 2026 ఫిబ్రవరితో ఒప్పందం గడువు ముగియనున్నందున పొడిగింపునకు తమతో కలిసి రావాలని అమెరికాను ఆయన కోరారు. ఒప్పందంలోని షరతులకు అమెరికా లోబడి ఉంటుందని రష్యా ఆశిస్తోందన్నారు.
వ్యూహాత్మక ఆయుధాలకు సంబంధించి అమెరికా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఒక వేళ అమెరికా క్షిపణి వ్యవస్థల మోహరింపును, అంతరిక్షంలో ఆయుధ వ్యవస్థల విస్తరణను చేపడితే తగు రీతిలో తమ చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఆయుధ పోటీని నివారించేందుకు ఉద్దేశించినన్యూ స్టార్ట్ ఒప్పందంపై 2010లో రష్యా అధ్యక్షుడు మెద్వెదెవ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకాలు చేశారు. దీని ప్రకారం..ఇరు దేశాలు 1,550కు మించి అణు వార్ హెడ్లను, 700కు మించి క్షిపణులు, బాంబర్లను కలిగి ఉండరాదు.