ట్రంప్‌తో ఫైటింగ్‌.. మస్క్‌కు రష్యా బంపరాఫర్‌ | Russia Offers Elon Musk Political Asylum | Sakshi
Sakshi News home page

ట్రంప్‌తో ఫైటింగ్‌.. మస్క్‌కు రష్యా బంపరాఫర్‌

Jun 7 2025 8:50 AM | Updated on Jun 7 2025 10:13 AM

 Russia Offers Elon Musk Political Asylum

మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)ల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎలాన్‌ మస్క్‌ను రష్యా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. మస్క్‌ తమ దేశానికి రావాలని.. రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని రష్యా తెలిపింది. ఈ మేరకు దిమిత్రి నోవికోవ్‌ చెప్పుకొచ్చారు.

డొనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ మధ్య స్నేహ బంధం బీటలు వారింది. ఈ నేపథ్యంలో మస్క్‌ను మచ్చిక చేసుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. తాజాగా రష్యాకు చెందిన స్టేట్‌ డూమా ఫెడరేషన్‌ కమిటీ ఛైర్మన్‌ దిమిత్రి నోవికోవ్‌ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాన్‌ మస్క్‌​ భిన్నమైన వ్యక్తి. ఆయన ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మస్క్‌ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తోంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ లాగానే మస్క్‌కు కూడా రష్యాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్‌ కోరుకోవడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు.

మరోవైపు.. ట్రంప్‌, మస్క్‌ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ నిరాకరించారు. ఇది యూఎస్‌ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు.  అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా.. నిజానికి ట్రంప్, మస్క్‌ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్‌ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్‌ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్‌ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్‌ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్‌ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్‌ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్‌ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్‌ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్‌ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement