వీధిలో పాన్‌ ఉమ్మినందుకు రూ.3.5 లక్షల జరిమానా  | Two Indian-origin men have been hit with hefty fines of 1,391 pounds | Sakshi
Sakshi News home page

వీధిలో పాన్‌ ఉమ్మినందుకు రూ.3.5 లక్షల జరిమానా 

Mar 20 2026 5:00 AM | Updated on Mar 20 2026 9:41 AM

Two Indian-origin men have been hit with hefty fines of 1,391 pounds

ఇద్దరు భారతీయులకు శిక్ష విధించిన లండన్‌ అధికారులు 

లండన్‌: బహిరంగ ప్రాంతాల్లో పాన్‌ ఉమ్మినందుకు లండన్‌లో ఇద్దరు భారతీయులకు దాదాపు రూ.3.48 లక్షల(2,800 డాలర్ల) జరిమానా విధించారు. మొదట విధించిన 100 పౌండ్ల జరిమానాను చెల్లించకపోవడం, కోర్టుకు గైర్హాజరవడంతో ఆగ్రహించిన బ్రెంట్‌ సిటీ అధికారులు పెద్ద మొత్తంలో జరిమానా విధించారు. లండన్‌ శివార్లలో ఉన్న ప్రాంతం బ్రెంట్‌. ఇది లండన్‌లోని అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం. 

పాన్‌ ఉమ్మడం వల్ల నగరం రోడ్లు పాడవుతున్నాయి. ఈ మరకలను శుభ్రపరచడానికి నగర కౌన్సిల్‌కు భారమైంది. పాన్‌ మరకలను శుభ్రపరచడానికి కౌన్సిల్‌ ఏడాదికి 30,000 పౌండ్లు ఖర్చు చేస్తోంది. ఇది పౌరులపై పన్ను భారం మోపుతుండటంతో నగర కౌన్సిల్‌ దీనికి వ్యతిరేకంగా జీరో–టాలరెన్స్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే ఎడ్జ్‌వేర్‌ పట్టణ నివాసి అయిన అక్షిత్‌ భద్రే పటేల్‌ 2025 జూన్‌లో స్థానిక మెట్రో స్టేషన్‌ సమీపంలోని కింగ్స్‌బరీ రోడ్డుపై పాన్‌ ఉమ్మినందుకు నార్త్‌ వెస్ట్‌ లండన్‌ మెజిస్ట్రేట్స్‌ కోర్టు జరిమానా విధించింది. పటేల్‌ కోర్టు విచారణకు హాజరు కాలేదు. తనకు విధించిన జరిమానా 100 పౌండ్లు చెల్లించలేదు. 

రూయిస్లిప్‌ శివారు ప్రాంత నివాసి అయిన హితేష్‌ పటేల్‌ వెంబ్లీ హిల్‌ రోడ్డుపై పాన్‌ ఉమ్మినందుకు జరిమానా విధించింది. మొదటి కేసు తరహాలోనే ఈయనా కోర్టుకు హాజరుకాలేదు. జరిమానా చెల్లించలేదు. దీంతో జరిమానా పది రెట్లు పెరిగింది. లండన్‌లోని బ్రెంట్, దాని పొరుగునే ఉన్న హారోతో సహా పలు ప్రాంతాల్లో పాన్‌ ఉమ్మివేయడంపై ఆందోళనల నేపథ్యంలో కౌన్సిల్‌ ఈ కఠిన చర్యలు చేపట్టింది. ‘మా వీధులను పాడుచేసే వారిని మేం అస్సలు సహించబోం. మేం విధించే ప్రతి జరిమానా ఒక స్పష్టమైన సందేశం. మీరు మా వీధులను పాడు చేస్తే మేం మిమ్మల్ని పట్టుకుంటాం. దానికి మీరు మూల్యం చెల్లించాల్సిందే’ అని కౌన్సిలర్‌ కృపా షెత్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement