సోషల్‌ మీడియాతో సంతోషం ఆవిరి!  | Social media blamed for stark decline in young people happiness | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాతో సంతోషం ఆవిరి! 

Mar 20 2026 4:41 AM | Updated on Mar 20 2026 4:41 AM

Social media blamed for stark decline in young people happiness

యువతలో పెరుగుతున్న ఆందోళన  

‘వరల్డ్‌ హ్యాపినెస్‌ రిపోర్ట్‌–2026’వెల్లడి  

సంతోషకరమైన దేశాల్లో ఫిన్‌లాండ్‌కు మొదటి ర్యాంకు 

అమెరికాకు 23, కెనడాకు 25, బ్రిటన్‌కు 29వ ర్యాంకు  

147 దేశాలకు గాను 116వ స్థానంలో నిలిచిన భారత్‌  

హెల్సింకీ:  ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన సోషల్‌ మీడియా యువతలో సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. లేనిపోని ఆందోళనకు కారణమవుతోంది. ప్రధానంగా పశి్చమ దేశాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన వెల్‌బీయింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ గురువారం విడుదల చేసిన ‘వరల్డ్‌ హ్యాపినెస్‌ రిపోర్ట్‌–2026’ఇదే విషయం వెల్లడించింది. గ్యాలప్‌ విశ్లేషణ సంస్థ, ఐక్యరాజ్యసమితి సస్టెనబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ భాగస్వామ్యంతో ఈ నివేదిక రూపొందించారు. 

అధ్యయనంలో భాగంగా 147 దేశాల్లో లక్షల మందిని ప్రశ్నించారు. వారి అభిప్రాయాలు సేకరించారు. ప్రపంచంలో ఫిన్‌లాండ్‌ అత్యంత సంతోషంగా ఉన్న దేశమని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఫిన్‌లాండ్‌ వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఈసారి టాప్‌–10 జాబితాలో ఫిన్‌లాండ్‌తోపాటు ఐస్‌లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే తదితర దేశాలకు స్థానం దక్కింది. అగ్రరాజ్యం అమెరికాకు 23, కెనడాకు 25, బ్రిటన్‌కు 29వ ర్యాంకు లభించింది. భారత్‌కు 116వ ర్యాంకు దక్కింది. నివేదికలోని కీలక అంశాలివీ..  

→ కోస్టారికా దేశం 2023లో 23వ స్థానంలో ఉండగా, 2026లో నాలుగో ర్యాంకు దక్కించుకుంది.  

→ ఏమాత్రం సంతోషంగా లేని దేశాల్లో అఫ్గానిస్తాన్, సియెర్రాలియోన్, మలావీ నిలిచాయి.  

→ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాల్లో 25 ఏళ్లలోపు యువత సోషల్‌ మీడియాకు బానిసగా మారుతోంది. ఫలితంగా వారు వాస్తవ ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. సంతోషానికి దూరమవుతున్నారు.  

→ మనుషులు సంతోషంగా ఉండాలంటే కుటుంబ బంధాలకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. సామాజికంగా ఇతరులతో స్నేహ సంబంధాలు మెరుగుపర్చుకోవాలి.  

→ సామాజిక జీవితాల్లో నాణ్యత, స్థిరత్వం ఉన్న దేశాల్లో ప్రజలు సంతోషంగా ఉంటున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాన్‌ ఎమ్మానుయేల్‌ డీ నెవ్‌ చెప్పారు. లాటిన్‌ అమెరికా దేశాల్లో కుటుంబ బంధాలు, సామాజిక సంబంధాలు బలంగా ఉంటాయని వెల్లడించారు. అందుకే అక్కడి ప్రజలు సంతోషంగా జీవిస్తున్నట్లు స్పష్టంచేశారు.  

→ ఫిన్‌లాండ్‌తోపాటు ఉత్తర యూరోపియన్‌ దేశాలు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటన్నది పరిశీలిస్తే.. అక్కడి సంపద, ఆ సంపద పంపిణీలో సమానత్వం, 
ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వాలు ఉండడం, ఆర్థిక విపత్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టడం, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉండడం వంటివి కనిపిస్తాయి.  

Advertisement
 
Advertisement
Advertisement