
కీవ్ లక్ష్యంగా రష్యా దాడులు తీవ్రతరం
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి భీకర దాడులకు తెరతీసింది. గురువారం రాత్రి కేవలం 7 గంటల వ్యవధిలో 550 వరకు డ్రోన్లు, 11 క్షిపణులను ప్రయోగించింది. రష్యా మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై దురాక్రమణ ప్రారంభించాక చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. షహీద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల పేలుళ్ల మోతలతో కీవ్ దద్దరిల్లింది. సైరన్లు రాత్రంగా మోగుతూనే ఉన్నాయి.
కీవ్‌లో ఐదంతస్తుల నివాస భవనం పాక్షికంగా ధ్వంసం కాగా, ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఒక గోదాము, ఒక గ్యారేజీ, ఆటో రిపేర్ కేంద్రం సైతం మంటల్లో చిక్కుకున్నాయి. కీవ్‌లోని రైల్వే వ్యవస్థ దెబ్బతిందని అధికారులు తెలిపారు. తెల్లారేసరికి కీవ్ రోడ్లన్నీ ధ్వంసమైన, కాలిపోయిన వాహనాలు, భవనాల వ్యర్థాలతో నిండిపోయాయి. ఈ దాడుల్లో 23 మంది గాయపడినట్లు సమాచారం.
‘మా ప్రజలు కఠినమైన, నిద్ర లేని రాత్రి గడిపారు’అని అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ప్రజలు మెట్రో స్టేషన్లు, బేస్‌మెంట్‌లు, భూగర్భ పార్కింగ్ గ్యారేజీల్లోకి పరుగులు తీశారని ఉక్రెయిన్ మంత్రి యూలియా తెలిపారు. కీవ్‌తోపాటు మరో ఐదు ప్రాంతాలపైకి రష్యా దాడులు చేసిందని జెలెన్‌స్కీ చెప్పారు. తాము 270 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో సంభాషణ జరిపిన రోజే తాజా దాడి జరగడం గమనార్హం.
యుద్ధం ఆపుతాడని అనుకోవడం లేదు:ట్రంప్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ సంభాషణ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణపై పుతిన్ సానుకూలంగా స్పందించారా అన్న ప్రశ్నకు ఆయన.. లేదు. ఈ విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దాడులపై నాకు సంతోషంగా లేదు. ఈ యుద్ధాన్ని పుతిన్ ఆపుతారని నేను అనుకోవడం లేదు’అని వ్యాఖ్యానించారు.