ట్రంపే బదులివ్వాలి | Pramila Jayapal seeks answers from Trump administration on student visa cancellations | Sakshi
Sakshi News home page

ట్రంపే బదులివ్వాలి

May 3 2025 2:16 AM | Updated on May 3 2025 2:16 AM

Pramila Jayapal seeks answers from Trump administration on student visa cancellations

స్టూడెంట్‌ వీసా రద్దుపై విదేశాంగ, హోంలాండ్‌ విభాగాలకు ప్రమీల లేఖ 

130 మంది డెమొక్రాట్ల సంతకాలు

వాషింగ్టన్‌: స్టూడెంట్‌ వీసాల రద్దు, విదేశీ విద్యార్థుల చట్టపరమైన హోదాను రద్దు చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై భారత సంతతికి చెందిన డెమొక్రాట్‌ ప్రమీలా జయపాల్‌ మండిపడ్డారు. ఏ ప్రాతిపదికన ఈ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ, హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగాలకు లేఖ రాశారు. దానిపై 130 మందికి పైగా డెమొక్రాట్లు సంతకాలు చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో అకస్మాత్తుగా వీసాల రద్దు వల్ల విద్యార్థుల భవిష్యత్‌ గందరగోళంలో పడుతుందని జయపాల్‌ అన్నారు.

వీసా హోదా అనిశ్చితి అమెరికా విశ్వవిద్యాలయాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రద్దు చేసిన కొందరు విద్యార్థుల వీసాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించినా అదింకా అమలు కాలేదు. కొందరు విద్యార్థులు ఇంకా ఇమిగ్రేషన్‌ నిర్బంధంలో ఉన్నారు. భవిష్యత్‌లో మరిన్ని వీసా రద్దులు జరుగుతాయనే భయాందోళనలు నెలకొన్నాయి’’అని లేఖలో పేర్కొన్నారు.

‘‘ఇది స్టూడెంట్‌ వీసా హోల్డర్లపై దాడి. ఈ భారీ, రాజకీయ ప్రేరేపిత ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విశ్వవిద్యాలయాలను భయానక ప్రదేశాలుగా మారుస్తోంది’అని జయపాల్‌ హెచ్చరించారు. ఆమె ఇమ్మిగ్రేషన్‌ ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సబ్‌ కమిటీలో సభ్యురాలు. కొన్ని వారాల్లో గ్రాడ్యుయేషన్‌ ఉండగా ఆకస్మిక వీసాల రద్దు పలువురు విద్యార్థులను అయోమయంలో పడేసింది. తమ వీసా హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 100 మందికి పైగా విద్యార్థులు కోర్టులను ఆశ్రయించారు. 

ఎవరీ ప్రమీలా జయపాల్‌? 
అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌ మహిళగా జయపాల్‌ రికార్డు సృష్టించారు. 1965 సెప్టెంబర్ 21న చెన్నైలో జన్మించిన ఆమె వాషింగ్టన్‌ 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక న్యాయం, వాతావరణం మార్పులు వంటి అంశాలపై ఎంతోకాలంగా క్రియాశీలకంగా పని చేస్తున్నారు. విద్యార్థి హక్కులు, వలస సంస్కరణల కోసం గళమెత్తుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement