బలూచిస్తాన్‌లో మళ్లీ రక్తపాతం  | Powerful Blast Hits Train In Pakistan Quetta | Sakshi
Sakshi News home page

బలూచిస్తాన్‌లో మళ్లీ రక్తపాతం 

May 24 2026 12:13 PM | Updated on May 25 2026 1:55 AM

Powerful Blast Hits Train In Pakistan Quetta

షటిల్‌ రైలులో భారీ పేలుడు 

24 మంది మృతి... 70 మందికి గాయాలు  

బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ఘాతుకం  

కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో మళ్లీ రక్తపాతం చోటుచేసుకుంది. షటిల్‌ రైలులో శక్తివంతమైన పేలుడు జరగడంతో కనీసం 24 మంది మరణించారు. దాదాపు 70 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని నిషేధిత బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్‌ నుంచి బయలుదేరి సిటీ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ఈ రైలును చమన్‌ ఫాటక్‌ సమీపంలో ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ వెల్లడించింది. 

కంటోన్మెంట్‌ ప్రాంతం నుంచి మిలటరీ జవాన్లను రైలులో తరలిస్తుండగా తాము దాడికి దిగామని బీఎల్‌ఏ ప్రతినిధి తెలిపారు. అయితే, ఇప్పటిదాకా 14 మంది మరణించారని, వీరిలో ముగ్గురు సైనికులు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొనగా, కనీసం 24 మంది మృతిచెందారని స్థానిక పోలీసులు స్పష్టంచేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. షటిల్‌ రైలులో సాధారణ ప్రయాణికులే ఎక్కువ మంది ఉన్నారని, పేలుడు ప్రభావంతో ఇంజన్, మూడు కోచ్‌లు దెబ్బతిన్నాయని పాకిస్తాన్‌ రైల్వేశాఖ మంత్రి హనీఫ్‌ అబ్బాసీ ప్రకటించారు. పేలుడు శబ్దాలు చాలా దూరం వినిపించాయి. సమీపంలోని వాహనాల అద్దాలు, ఇళ్ల అద్దాలు పగిలిపోయాయంటే పేలుడు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

ఈద్‌ పండుగ కోసం పెద్ద సంఖ్యలో జనం స్వస్థలాలకు వెళ్తుండగా పేలుడు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.  బీఎల్‌ఏ ముష్కరుల దుశ్చర్యను పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పిరికిపంద ఉగ్రవాద చర్యలు పాకిస్తాన్‌ ప్రజల సంకల్పాన్ని బలహీనపర్చలేవని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించివేయడానికి అంకితభావంతో కృషి చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు షటిల్‌ రైలులో పేలుడుతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. పెషావర్‌కు చేరాల్సిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ముందుజాగ్రత్త చర్యగా క్వెట్టా రైల్వేస్టేషన్‌లోనే నిలిపివేశారు. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని క్వెట్టా కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌లో 2024 నవంబర్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 32 మంది మరణించిన సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement