
దక్షిణ ఫ్రాన్స్‌లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
సబ్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం
ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్లు అనుమానాలు
పారిస్: ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న సమయంలోనే గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని అల్పిస్–మారిటైమ్స్ ప్రాంతంలో శనివారం ఉదయం 1.60 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఇదే ప్రాంతంలో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది. కరెంటు లేకపోవడంతో కొన్ని కార్యక్రమాలు రద్దు చేయాల్సి వచ్చింది. అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించడంతో ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
సాయంత్రం ఫిలిం ఫెస్టివల్ ముగింపు వేడుకలు యథాతథంగా జరిగాయి. కరెంటు సరఫరా హఠాత్తుగా ఆగిపోవడానికి కారణం ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి కాన్స్ సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీనివల్ల విద్యుత్ గ్రిడ్‌లో సమస్యలు తలెత్తాయి. హై–ఓల్టేజీ కరెంటు లైన్ ఒకటి కూలిపోయిందని విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పారు. దీనివల్ల అల్పిస్–మారిటైమ్స్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. అయితే, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగడం వెనుక కుట్ర ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు అంతరాయం కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ కుట్ర జరిగినట్లు అంచనా వేస్తున్నారు.