జైళ్ల నుంచి జర్నలిస్ట్‌లను విడిచిపెట్టాలి | Pope Leo calls for journalists to be released from prison | Sakshi
Sakshi News home page

జైళ్ల నుంచి జర్నలిస్ట్‌లను విడిచిపెట్టాలి

May 13 2025 6:33 AM | Updated on May 13 2025 6:33 AM

Pope Leo calls for journalists to be released from prison

పత్రికా స్వాతంత్య్రం విలువైన కానుక

మొట్టమొదటి మీడియా భేటీలో పోప్‌ లియో 14 

వాటికన్‌ సిటీ: జైళ్లలో ఉన్న జర్నలిస్ట్‌లందరినీ వెంటనే విడుదల చేయాలని నూతన పోప్‌ లియో 14 పిలుపునిచ్చారు. పత్రికా స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం మనకున్న విలువైన కానుకలని ఆయన నొక్కి చెప్పారు. మొట్టమొదటి సారిగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. వాటికన్‌ సిటీలో ఆడిటోరియంలోకి ఆయన ప్రవేశించడంతోనే అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు.

 శాంతి బలోపేతమయ్యేలా, యుద్ధాన్ని తిరస్కరించేలా రాయాలని, అణగారిన వారికి గొంతుకగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా సత్యాన్ని కనుగొనే క్రమంలో జైళ్ల పాలైన జర్నలిస్టులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఇటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన పిలుపునివ్వగానే ప్రాంగణంమంతా చప్పట్లతో ప్రతిధ్వనించడం విశేషం. ‘ఇటువంటి వారిని చర్చి గుర్తిస్తుంది. 

ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి యుద్ధం పురోగతిని గురించి బయటి ప్రపంచానికి తెలిపే వారి గురించే నా తపనంతా. గౌరవం, న్యాయం, ప్రజల సమాచార హక్కును కాపాడే ధీరులు వీరంతా. ఎందుకంటే, సమాచారం ఉంటేనే కదా ఎంపికలో స్వేచ్ఛ ఉండేది!’అని పోప్‌ పేర్కొన్నారు. మనం ఇతరులను చూసే విధానం, వారి మాట వినడం, వారి గురించి మాట్లాడే విధానం ద్వారా శాంతి మనతోనే ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. 

పోప్‌ ఎన్నికను కవర్‌ చేసేందుకు ప్రపంచ దేశాల నుంచి తరలివచి్చన సుమారు 6వేల మంది పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభంలో కొద్ది సేపు ఇంగ్లి‹Ùలో మాట్లాడిన ఆయన..ఆ తర్వాత మొత్తం ఇటాలియన్‌లోనే కొనసాగించారు. ముందు వరుసల్లో ఉన్న కొందరు జర్నలిస్టులను పోప్‌ లియో 14 పలకరించారు. హాలు నుంచి తిరిగి బయటకు వెళ్లేటప్పుడు కొందరితో కరచాలనం చేశారు. ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేశారు. కొందరితో సెల్ఫీలకు పోజిచ్చారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement