వైట్‌హౌస్‌: అటు కాల్పులు.. ఇటు లైవ్‌ రిపోర్టింగ్‌ | Journalists Duck For Cover As Gunman Opens Fire Outside White House | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌: అటు కాల్పులు.. ఇటు లైవ్‌ రిపోర్టింగ్‌

May 24 2026 8:14 AM | Updated on May 24 2026 8:46 AM

Journalists Duck For Cover As Gunman Opens Fire Outside White House

అమెరి​కా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. వైట్‌హౌస్ వెలుపల లైవ్ కెమెరాల ముందే తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొంది. వైట్‌హౌస్ ఉత్తర మైదానం నుంచి లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్న జర్నలిస్టులు.. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినబడటంతో ప్రాణాలు రక్షించుకునేందుకు కిందకు వంగి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

ఈ ఘటనకు సంబంధించిన పలు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైట్‌హౌస్ ప్రాంగణం వెలుపల వరుసగా తుపాకీ కాల్పులు జరిగిన ఆ క్షణంలో రిపోర్టర్లు ఎలా స్పందించారో ఈ వీడియోలలో స్పష్టంగా రికార్డైంది. ఓ మీడియా సంస్థకు చెందిన సెలినా వాంగ్ మాట్లాడుతూ.. కొద్ది సెకన్ల పాటు ఆమె ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇది పటాకుల శబ్దంలా అనిపించింది.. కానీ నిజానికి తుపాకీ కాల్పులు" అని తెలిపింది. ఈ ఘటన సమయంలో ఆమె ఆ ప్రాంగణంలో వీడియో  షూట్‌ మధ్యలో ఉన్నారు.

'FaytuksNetwork' అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వైరల్ వీడియోలో.. ఓ టెలివిజన్ రిపోర్టర్ డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ల మద్దతు గురించి చాలా ప్రశాంతంగా లైవ్ రిపోర్ట్ ఇస్తుండటం కనిపిస్తుంది. అయితే సరిగ్గా అదే సమయంలో పక్కనే తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆ జర్నలిస్ట్ తాను చెబుతున్న వాక్యాన్ని పూర్తి చేసి.. చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంతో చూస్తూ.. తన టై మరియు ఇయర్‌పీస్‌ను సర్దుకుంటూ పరిస్థితి తీవ్రతను గమనించడం ఆ వీడియోలో కనిపించింది.

కాగా, వైట్‌హౌస్‌ సమీపంలో సీక్రెట్‌ సర్వీస్‌ చెక్‌పాయింట్‌ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వైట్‌హౌస్‌ సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు తెలిపారు.

దీంతో జర్నలిస్టులను వైట్‌హౌస్‌ ప్రెస్‌ బ్రీఫింగ్‌ రూమ్‌లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు వైట్‌హౌస్‌ వద్ద భారీగా మోహరించారు. కాల్పుల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల శబ్దాలు వినిపించడంతో భవనం మొత్తం కొద్దిసేపు లాక్‌డౌన్‌లోకి వెళ్లింది.

Advertisement
 
Advertisement
Advertisement