పాక్‌ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్‌ అక్కడే! | POKs Autonomy: Pakistans Biggest Political Game | Sakshi
Sakshi News home page

పాక్‌ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్‌ అక్కడే!

Jun 11 2026 9:08 AM | Updated on Jun 11 2026 10:26 AM

POKs Autonomy: Pakistans Biggest Political Game

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) గురించి.. చాలామందికి ఓ సందేహం రావొచ్చు. పాకిస్థాన్‌ నియంత్రణలో ఉన్న ప్రాంతమే అయితే అక్కడ ప్రత్యేకంగా ప్రధాని, రాష్ట్రపతి, శాసనసభ, రాజ్యాంగం, జెండా ఎందుకు ఉన్నాయి? పీవోకే నిజంగానే స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతమా? కాదా?.. ఇటీవల పీవోకేలో చెలరేగిన ఆందోళనలు, పాకిస్థాన్‌ ప్రభుత్వ అణచివేత చర్యల నేపథ్యంలో ఈ ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.

పాకిస్థాన్‌ అధికారికంగా పీవోకేను "ఆజాద్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌"గా పిలుస్తుంది. పేరు వింటే అది స్వతంత్రమో.. స్వయం ప్రతిపత్తితో నడిచే ప్రాంతంలా అనిపిస్తుంది. అక్కడ ప్రత్యేక శాసనసభ ఉంది. రాష్ట్రపతి, ప్రధాని, న్యాయవ్యవస్థ, మంత్రివర్గం, జెండా, తాత్కాలిక రాజ్యాంగం కూడా ఉన్నాయి. పైకి చూస్తే ఒక ప్రత్యేక రాజకీయ వ్యవస్థ ఉన్న ప్రాంతంలా కనిపిస్తుంది. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

ఈ వ్యవస్థ వెనుక ఉన్న కథ 1947 విభజన కాలానికి వెళ్తుంది. జమ్మూ కశ్మీర్‌ సంస్థానం భారత్‌లో విలీనం కావడంతో మొదటి భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం జరిగింది. యుద్ధం ముగిసే సమయానికి కశ్మీర్‌లోని కొంత భూభాగం పాకిస్థాన్‌ ఆక్రమణలో మిగిలిపోయింది. అయితే ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో అధికారిక ప్రావిన్స్‌గా కలుపుకోలేదు. అలా చేస్తే మొత్తం జమ్మూ కశ్మీర్‌పై తమ హక్కు బలహీనపడుతుందని ఇస్లామాబాద్‌ భావించింది. అందుకే ఒకవైపు కశ్మీర్‌ వివాదం కొనసాగుతుందనే వాదనను నిలబెట్టుకుంటూనే, మరోవైపు ఆ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంలా ప్రపంచానికి చూపించే వ్యూహాన్ని అమలు చేసింది.

దీంట్లో భాగంగానే 1949 కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగం, సమాచార వ్యవస్థ వంటి కీలక అధికారాలను పాకిస్థాన్‌ తన చేతుల్లోకి తీసుకుంది. అనంతరం 1974లో తాత్కాలిక రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి రాష్ట్రపతి, ప్రధాని, శాసనసభ, న్యాయవ్యవస్థ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దీంతో పీవోకేకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. 

ఆ రాజ్యాంగం ప్రకారం పీవోకేలో ఆ దేశ అధ్యక్షుడు రాజ్యాంగబద్ధ అధిపతి కాగా.. ప్రధాని కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరించాలి. కానీ అలా ఏనాడూ జరగలేదు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎక్కువగా పాకిస్థాన్‌ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటూ వచ్చాయి. రక్షణ, విదేశాంగం, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక అంశాలు, కీలక పరిపాలనా నిర్ణయాలన్నీ ఇస్లామాబాద్‌ అనుమతితోనే అమలవుతాయి. పీవోకే పరిపాలనలో కూడా పాకిస్థాన్‌ నుంచి పంపిన అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది.

అంతేకాదు, పీవోకేలో రాజకీయ వ్యవస్థపై పాకిస్థాన్‌ ప్రభావం ఎంత బలంగా ఉందో అక్కడి ఎన్నికల విధానం కూడా చూపిస్తుంది. శాసనసభలో కొన్ని స్థానాలు పీవోకేలో నివసించే ప్రజల కోసం కాకుండా, పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ఈ స్థానాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విమర్శలు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజల కంటే ఇస్లామాబాద్‌కు మరింత అనుకూలంగా రాజకీయ సమీకరణాలు జరిగే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరో వివాదాస్పద అంశం విధేయత ప్రమాణం. పీవోకేలో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వ్యక్తులు కశ్మీర్‌ పాకిస్థాన్‌లో విలీనం కావాలనే సిద్ధాంతానికి మద్దతు ఇస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. భిన్నాభిప్రాయాలకు, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు అక్కడ అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయని విమర్శలు ఉన్నాయి. అలా.. ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్‌ సృష్టించిన నామ మాత్రపు రాజకీయ వ్యవస్థేనని స్పష్టమవుతోంది.  

ఇక భారత్‌ మాత్రం పీవోకేను ఎప్పటికీ తన అంతర్భాగంగానే పరిగణిస్తోంది. 1947 నుంచి ఈ ప్రాంతం పాకిస్థాన్‌ అక్రమ ఆక్రమణలో ఉందని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ కూడా పీవోకే భారత భూభాగమేనని అధికారికంగా పేర్కొంటోంది. అందుకే పీవోకేకు ప్రత్యేక రాజ్యాంగం, ప్రధాని, అధ్యక్షుడు, జెండా వంటి వ్యవస్థలు ఉన్నాయనే కారణంతో అది స్వతంత్ర ప్రాంతమో, ప్రత్యేక దేశమో అయిపోదని భారత్‌ వాదిస్తోంది. దశాబ్దాలుగా ‘ఆజాద్‌ కశ్మీర్‌’ అనే పేరుతో ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వాస్తవానికి పీవోకే రాజకీయ, పరిపాలనా, భద్రతా వ్యవస్థలన్నీ ఇస్లామాబాద్‌ నియంత్రణలోనే కొనసాగుతున్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకే పీవోకేలో కనిపించేది ఒక ప్రభుత్వం అయితే.. పనిచేసేది మాత్రం పాకిస్థాన్‌ రిమోట్‌ కంట్రోల్‌ వ్యవస్థేనని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement