
డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం
ఐక్యరాజ్యసమితి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9 నుంచి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ(యూఎన్‌జీఏ) వార్షిక ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 23 నుంచి 29 దాకా జనరల్ డిబేట్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని సమాచారం. డిబేట్‌లో ప్రసంగించేవారి పేర్ల జాబితాను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ఇందులో మోదీ పేరును సైతం చేర్చారు. సంప్రదాయం ప్రకారం తొలుత బ్రెజిల్, తర్వాత అమెరికా అధినేత ప్రసంగిస్తారు.
డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల 23న యూఎన్‌జీఏ పోడియం నుంచి ప్రసంగించబోతున్నారు. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో చేయబోతున్న తొలి ప్రసంగం ఇదే కావడం విశేషం. సెప్టెంబర్ 26న మోదీ ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. అదే రోజు ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ నేతలు కూడా మాట్లాడుతారు. మరోవైపు అమెరికా పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్లు సమాచారం. భారత ఉత్పత్తులపై విధించిన 50 శాతం సుంకాలపై ట్రంప్‌తో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.