Narendra Modi: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం

PM Modi Address SCO Summit In Dushanbe - Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం పెచ్చుమీరుతోందనడానికి ఇటీవల అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయని, ప్రాంతీయంగా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో అంతర్జాతీయ సమాజం ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారాన్ని అడ్డుకోవడానికి ఎస్‌సీఓ సమష్టిగా చర్యలు చేపట్టాలని కోరారు. మధ్య ఆసియా సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉగ్రవాద శక్తులపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.  

దేశాల మధ్య అనుసంధానం అవసరం 
మధ్య ఆసియాలో వివిధ దేశాల మధ్య భౌగోళికంగా అనుసంధానం ఉంటే మార్కెట్‌ మరింత విస్తృతమవుతుందని నరేంద్ర మోదీ వివరించారు. మధ్య ఆసియా, భారత్‌కు మధ్య కనెక్టివిటీ పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం లేకపోవడంతో వల్ల భౌగోళికంగా అడ్డుగోడలు ఏర్పడుతున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, ప్రాజెక్టుల నిర్మాణం పారదర్శకంగా జరగాలని హితవు చెప్పారు. ఎస్‌సీఓలో కొత్తగా చేరిన సభ్యదేశం ఇరాన్‌కు మోదీ స్వాగతం పలికారు. 

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడం సరికొత్త వాస్తవం అని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఆ దేశంలో మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందన్నారు. ఉగ్రవాదులకు అఫ్గాన్‌ ఆశ్రయం ఇవ్వదని తెలిపారు. చైనాయే తమకు నమ్మకమైన నేస్తమని ఇమ్రాన్‌ మరోసారి స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్‌ నుంచి విదేశీ బలగాలు వెళ్లిపోయాక ఒక కొత్త చరిత్ర మొదలైందని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ అన్నారు. అయినప్పటికీ ఆ దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఎస్‌సీఓ సభ్య దేశాలు అఫ్గాన్‌కు అన్ని విధాల సహకరించాలని పిలుపునిచ్చారు.  

చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top